ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని నిర్ణయాలు ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తే, కొన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి నిర్ణయమూ కీలకమైందనే చెప్పుకోవాలి. తీసుకునే ప్రతి నిర్ణయం మీదా ముందుగా ప్రజాభిప్రాయం తెలుసుకోనక్కర్లేదు. కొన్ని కొన్నింటి విషయంలో అవసరం. ఏపీ ప్రభుత్వం త్వరలోనే విద్యుత్ చార్జీలు పెంచబోతోంది. ఇందుకోసం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయం సేకరించబోతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. దాని ప్రకారం ఇళ్లకు, వాణిజ్య సంస్థలకు, ఇతరత్రా విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తుంది.
ఇది బాగానే ఉంది. విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్న ప్రభుత్వం కీలకమైన రాజధాని మార్పు విషయంలో ఎందుకు ఈ పని చేయలేదు? జగన్ ప్రభుత్వానికి బండ మెజారిటీ ఉంది కాబట్టి ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోగలదు. ఆ అధికారం కూడా ఉంది. మెజారిటీ ఉంది కాబట్టి ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రజా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే కీలక నిర్ణయం తీసుకోవడం సమంజసమా? ఇది ఇప్పుడు జనంలో జరుగుతున్న చర్చ. రాజధాని మార్పుపై లేదా మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించలేదు అనే ప్రశ్నకు వైకాపా నేతల నుంచి వెంటనే వచ్చే సమాధానం అమరావతిపై నిర్ణయం తీసుకునే ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభిప్రాయం తీసుకున్నారా? అని.
చంద్రబాబు చేయలేదు కాబట్టి జగన్ ప్రభుత్వమూ చేయదు. అయితే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ అమరావతి నిర్మాణాన్ని అసెంబ్లీలో సమర్థించారు. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడంలేదన్నారు. అప్పట్లో అమరావతి నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ అసెంబ్లీలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటిమాదిరిగా రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యమం రాలేదు. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం నిపుణులతో శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. సరే…దాని సిఫార్సులను బాబు పట్టించుకోలేదనుకోండి. అది వేరే విషయం. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
అయితే శివరామకృష్ణన్ కమిటీ ప్రజల్లో తిరిగింది. వారి అభిప్రాయాలు సేకరించింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు హయ్యెస్ట్ రేటింగ్ ఇచ్చింది. కాని జగన్ ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీగాని, కన్సెల్టన్సీ సంస్థ బోస్టన్ కన్సెల్టన్సీ గ్రూపుగాని ప్రజాభిప్రాయం తీసుకున్న దాఖలాలు లేవు. అప్పటి శివరామకృష్ణన్ కమిటీకి చట్టబద్ధత ఉంది. కాని ఈ రెండు కమిటీలకు చట్టబద్ధత లేదు. శివరామకృష్ణన్ కమిటీకి అప్పటి కేంద్ర ప్రభుత్వం రిపోర్టు ఫలాన విధంగానే ఇవ్వాలని, ఫలాన చోటనే రాజధాని నిర్ణయించాలని చెప్పలేదు. కాని జీఎన్‌రావు కమిటీకి, బీసీజీకి ప్రభుత్వం ముందే దిశానిర్దేశం చేసింది.
ప్రభుత్వం చెప్పిన ప్రకారమే తాము చేశామని ఈ కమిటీలు చెప్పాయి. అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పలేదని అర్థమవుతోంది. ఇక పది మంది మంత్రులతో, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ కూడా ప్రజాభిప్రాయం ఊసెత్తే ప్రశ్నే లేదు. ఆ రెండు కమిటీల నివేదికల్లోని అంశాలను అధ్యయనం చేసి, మార్పులు చేర్పులుంటే చేసి తన నివేదిక ఇస్తుంది. ప్రభుత్వంగాని, మంత్రులుగాని ఇప్పటివరకు ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులతో అధికారికంగా మాట్లాడలేదు, చర్చలు జరపలేదు.
ఈనాటివరకు రైతుల దగ్గరకు ఎవ్వరూ వెళ్లలేదు. ఎవరెంత అరిచి మొత్తుకున్నా రాజధాని మార్పు ఆగదంటున్నారు మంత్రులు, స్పీకర్. జగన్ వైఖరి చూస్తుంటే రాజధాని అనేది ప్రజలకు సంబంధం లేని విషయం. కొందరు మంత్రులు ఈ విషయం కూడా చెప్పారులెండి. రాజధాని అంటే ‘రాజు’కు (ముఖ్యమంత్రి) సంబంధించిన విషయం మాత్రమే. కాబట్టి సర్కారు ఏం చేసినా ప్రజలు ప్రశ్నించకూడదని పాలకులు అభిప్రాయం.