రాష్ట్ర ప్రభుత్వం జీవోలను చాలా కాలంగా అప్ లోడ్ చేయడం లేదు. అలా చేయడం చట్ట విరుద్ధం.. రాజ్యాంగ విరుద్ధం. అయినా సరే ఇలా చేయడం ప్రభుత్వానికి కామన్ కాబట్టి చేసేసింది. కోర్టుల్లో ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. తాజాగా జీవోలను దాచడంపై కోర్టులో విచారణకు సమయం దగ్గర పడటంతో ఇప్పుడు జీవోలను బయట పెడుతున్నారు. అవి కూడా పూర్తిగా బయటకు రావడం లేదు. కొన్ని వివాదాస్పద జీవోలు వెలుగులోకి తెస్తున్నారు.
తాజాగా విశాఖ పట్నంలో ఏపీ ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాలకుపైగా అతి విలువైన భూమిని ప్రభుత్వం ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కు బదలాయించి తాకట్టు పెట్టేసిన వైనం వెలుగులోకి చూసింది. ఇలా భూమిని బదలాయించిన జీవో బయటకు వచ్చింది. అయితే ఏ ఏ భూమి బదలాయించారో మాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇలాంటి జీవోలు చాలా ఉన్నాయని.. విశాఖలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క విశాఖలోనే కాదని.. రాష్ట్రలో ప్రజాఆస్తులు చాలా వరకూ తాకట్టులోకి వెళ్లిపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం చాలా కాలంగా జీవోలను బయట పెట్టడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. మాన్యువల్‌గా జీవోలు జారీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ కూడాఏర్పాటు చేశారు. అయితే రాజ్యాంగపరంగా.. జీవోలను సీక్రెట్‌గా ఉంచకూడదు. కానీ ఉంచుతున్నారు. కోర్టుల్లో పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ఒకటి.. రెండు మాత్రం గెజిట్‌లో పెడుతున్నారు. జీవోలు బయటకు వస్తే.. అవి చట్ట విరుద్ధమని ఎవరైనాకోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది. అలా చాన్స్ ఇవ్వకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అలాగే.. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలకు తెలిసిపోతుంది. అందుకే సీక్రెట్‌గా ఉంచుతారు.
పారదర్శక పాలన చేస్తామని జగన్ గొప్పగా చెప్పారు. కామెడీ ఏమిటంటే.. ఇప్పటికీ తాము పారదర్శక పాలన చేస్తున్నామంటారు. కానీ ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయం ఒక్కటీ బయటకు రాలేదు. అర్థరాత్రి జీవోలు జారీ అవుతాయి. ప్రజల్ని .. రాష్ట్రాన్నిపరిపాలిస్తున్నారో.. సొంత వ్యవస్థను నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని ఉన్నతాధికారులే విసుక్కునే పరిస్థితి ఉంది.