కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న వికాట్ గ్రూపు పరిశ్రమ భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. ఆ కంపెనీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. కాలుష్యం, కబ్జాలు ఇతర కారణాలతో … పలు గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
భారతి సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ తన భార్య భారతి పేరు మీద ఏర్పాటు చేశారు. ఇది ఉత్పత్తి ప్రారంభించక ముందే పదిహేనేళ్ల కిందటే… 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే కంపెనీకి రూ. రెండు వేల కోట్లకు అమ్మేశారు. అయితే విచిత్రంగా రూ. రెండు వేల కోట్లు ఇచ్చిన వికాట్.. పేర్లలోనే కనిపిస్తుంది. మొత్తం పరిశ్రమను జగన్ కుటుంబసభ్యులే నిర్వహిస్తూంటారు. ఏపీలో వైసీపీ వచ్చాక భారతి సిమెంట్స్ మాత్రమే అత్యధికంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వస్తోంది.
అయితే ఈ ఫ్యాక్టరీ కనీస కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ఏవేవో హామీలు ఇచ్చి సర్దుబాటు చేసింది. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజలు తెరపైకి వస్తున్నారు. గతంలో ప్రభుత్వం కడపలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలను మూసివేయించింది. ఇప్పుడు అదే పరిస్థితి భారతి సిమెంట్స్ కు వచ్చే అవకాశం ఉంది. నాలుగో తేదీ తర్వాత ఏమైనా జరగొచ్చన్న సెటైర్లు కడపలో వినిపిస్తున్నాయి.