“పనోడు పందిరేస్తే పిచ్చిక వాలగానే పడిపోయిందట.”… ఇప్పుడు సీఏఏ, ఎన్నార్సీ విషయంలో దేశంలో జరుగుతున్న రగడ..దాన్ని భారతీయ జనతా పార్టీ డీల్ చేస్తున్న విధానం చూస్తే.. ఇలా అనిపించక మానదు. సీఎఏ, ఎన్నార్సీల పేరుతో.. దేశంలోఓ రకమై విభజిత వాతావరణం ఏర్పడింది. ఆ చట్టాలు తెచ్చిన కేంద్రం.. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోలేకపోయింది. కరోనా వైరస్ వచ్చి కాస్త దృష్టి మరల్చింది కానీ.. ఇప్పటికీ.. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గోద్రా తరహా ఘోరం అక్కడ జరిగిపోయింది. దీనికి మూలం.. సీఏఏ, ఎన్నార్సీనే.
సీఏఏ, ఎన్నార్సీలపై ప్రభుత్వం చెప్పదు.. ప్రజలకు తెలీదు..!
ఓ సినిమాలో రాజకీయ నాయకుడు సభలో ప్రసంగించడానికి సిద్ధమవుతాడు. నేనేం మాట్లాడతానో తెలుసా.. అని సభకు వచ్చిన వారిని అడుగుతారు. సగం మంది తెలుసని.. సగం మంది తెలియదని చెబుతారు. వెంటనే ఆ నాయకుడు… తెలిసిన వాళ్లు.. తెలియని వాళ్లకు చెప్పాలని.. తెలియని వాళ్లు.. తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవాలని చెప్పి వెళ్లిపోతాడు. ఇది కామెడీ సీన్ కావొచ్చు కానీ ఇందులో ఎంతో అర్థం ఉంది… ఇప్పుడు ఎన్నార్సీ, సీఏఏల విషయంలోనూ… కేంద్ర ప్రభుత్వం తీరు ఆ నాయకుడిలానే ఉంది. సిటిజన్ షిప్అమెండెంట్ బిల్ సీఏఏ, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్ షిప్ ఎన్నార్సీ.. వీటి గురించి దేశంలోని 95 శాతం మందికి తెలియదు. రోడ్లెక్కి ఆందోలన చేస్తున్న వారికీ తెలియదు. కానీ అది.. తమను దేశం పంపేయడానికి… తెచ్చిన చట్టం అని నమ్ముతున్నారు. అలా అలాంటిది కాదని.. ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటి మాట ద్వారా చెబుతున్నారు. కానీ.. మాటలతో ఇప్పుడు.. ఆందోళన చెందుతున్న ప్రజలు సంతృప్తి పడే పరిస్థితులు లేవు. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అసలు ఆ చట్టాల్లో ఏముందో చెబుతామంటూ.. బీజేపీ పార్టీ పరంగా హడావుడి చేసింది. కొన్ని సభలు పెట్టుకుంది. కానీ ఇది పార్టీ పరమైన వ్యవహారం కాదు. ప్రభుత్వానికి సంబంధించినది.. దేశ సమగ్రతకు సంబంధించినది. ఈ విషయంలో అసలు సీఏఏను.. ఎందుకు తేవాల్సి వచ్చంది.. ఎన్నార్సీని ఎందుకు అమలు చేస్తామంటున్నారో.. అందరికీ నమ్మకం కలిగేలా వివరించగలగాలి. కానీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. సీఏఏ ఎన్నార్సీపై ఎవరికీ తెలియదు.. తెలిసిన వారు ఎవరికీ చెప్పరు.
బిల్లు పాస్ చేసినప్పుడు లేని వ్యతిరేకత..! ఇప్పుడు కాల్చేస్తోంది..!
పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు… సిటిజన్‌షిప్ అమెడెంట్ బిల్లుకి దేశంలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. ముస్లిం ఓట్ల మీదే గెలుపు తీరాలు చేరుకునే.. వైసీపీ లాంటి పార్టీలు విప్ కూడా జారీ చేసి మరీ మద్దతు పలికాయి. కానీ ఆ బిల్లు పాస్ అయిన తర్వాత… ప్రారంభమైన ఆందోళనలు.. అంతకంతకూ విస్తరించడం ప్రారంభించాయి. ఆ ఆందోళనల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. దీంతో.. వైసీపీ లాంటి పార్టీలు.. యూటర్న్ తీసుకుని.. మేము వ్యతిరేకమని.. చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చట్టం చేసినప్పుడు.. పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు లేని వ్యతిరేకత.. తర్వాత ప్రజల్లో ఎందుకొచ్చింది..?. ఆ చట్టంలో రహస్య ఎజెండా ఉందన్న అత్యుత్సాహ ప్రచారం వల్లే. భారతీయ జనతా పార్టీ నేతలు.. తమకు అనుకూలంగా లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని.. దేశంలో అలాంటి వారందర్నీ ద్వితీయ శ్రేణి పారులుగా చూసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానం.. ఆయా వర్గాల్లో పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
అన్ని వర్గాలనూ భయపెట్టేలా పౌరసత్వ నిరూపణ ప్రచారం..!
సీఏఏ- ఎన్నార్సీ ఆందోళన ముస్లింలది మాత్రమే కాదు. వారితో పాటు ఇతరుల కూడా రోడ్లపైకి వస్తున్నారు. రోడ్లపైకి వచ్చి చేసేవారిది మాత్రమే ఆందోళన కాదు… బీజేపీ ఓటు బ్యాంక్ అనుకుంటున్న వర్గాలు కూడా.. ఈ చట్టాలపై అనుమానంతో ఉన్నాయన్నది వాస్తవం. సీఏఏ చట్టం ప్రకారం.. ప్రతి భారతీయుడు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. దాని కోసం కొన్ని డాక్యుమెంట్లు చూపించారు. ఆధార్ కార్డ్ వ్యాలిడ్ కాదు. ఆస్తి ఉండటం వ్యాలిడ్ కాదు. పూర్వీకులు కూడా.. భారతీయులేనని నిరూపించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం దేశజనాభాలో తాతల పేర్లు కూడా తెలియని వారు.. తమ పుట్టిన రోజులు కూడా తెలియని వారు.. కోట్లలోనే ఉంటారు. అలాంటిది.. తమ తాతల పుట్టినరోజు ధృవపత్రాలు.. తల్లిదండ్రుల వారసత్వ పత్రాలు తీసుకు వచ్చిచూపించడం అంటే..అంతకు మించిన తలనొప్పి మరొకటి ఉండదు. సాధారణంగా ప్రభుత్వ సర్వీస్ అంటే.. ఎంత దారుణంగా ఉంటుందో ప్రజలు రోజూ చూస్తూనే ఉంటారు. ఏ పని మీద వెళ్లినా.. ఆ డాక్యుమెంట్.. ఈ డాక్యుమెంట్ అని తిప్పుతారు కానీ పని జరగదు. అలాంటి ఎన్నార్సీ విషయంలో.. ఇంకా ఎక్కువ సతాయింపులు ఉంటాయని జనం నమ్ముతున్నారు. ఇక్కడ పుట్టి.. ఇక్కడ పెరిగి.. ఇక్కడి వాడినే అని నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్యం ఏమిటన్న ఆందోళన.. అందరిలోనూ వస్తోంది. ఆ ఆందోళన.. ఆగ్రహజ్వాలగా కనిపిస్తోంది.
దేశ ప్రజల మధ్య ఉద్దేశ పూర్వక విభజన రేఖ ..!
కేంద్రానికి.. సీఏఏ చట్టాన్ని తెచ్చిన వారికి దీన్ని ఏ లక్ష్యంతో తెచ్చారో స్పష్టత ఉంది. నిజానికి ఇందులో పౌరసత్వం లాక్కునే క్లాజ్ లేదని.. ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా పౌరసత్వం ఇవ్వడానికేనని అంటోంది. అదీ కూడా.. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలను తరిమేసి.. హిందువులకు మాత్రమే.. పౌరసత్వం ఇవ్వాలని చెబుతోంది. ఇలా మతపరమైన విభజన చూపడం రాజ్యాంగ విరుద్ధం. ఈ మాట చెప్పి.. చెప్పి.. చాలా మందికి నోరు పడిపోయిది. ఎప్పుడో భారత్‌లో అంతర్భాగంగా ఉన్నంత మాత్రాన.. వారెవరూ భారతీయులు కాదు. హిందువులైనా భారతీయులు కాదు. ఎవరికీ పౌరసత్వం ఇవ్వకూడదు అనేది చాలా మంది అభిప్రాయం. కానీ వారు ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఉండటంతో.. బీజేపీ అడుగు ముందుకేసింది. అందుకే ఈ చట్టం గురించి.. ప్రజలకు పూర్తి స్తాయిలో అవగాహన కల్పించడానికి వెనుకాడుతోంది. తెలిసి తెలియనట్లుగా ఉంచుతూ.. ప్రజల్లో విభజన వచ్చేలా చేస్తోంది. దాడులు.. దహనాలు.. ఆందోళనలు పెరిగిపోతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. బహుశా .. బీజేపీ కోరుకుంటోంది కూడా ఇదే కావొచ్చు. అందుకే సైలెంట్‌గా ఉంటోంది. దేశ ప్రజల్లో ఇలా విభజన వస్తే.. మెజార్టీ మద్దతుతో.. తాము అధికారంలో కొనసాగవచ్చని అనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.
రాజకీయం కోరుకుంటున్నది కూడా.. ప్రజల మధ్య ఈ విభజనేనా..?
దేశంలో ప్రజల మధ్య అడ్డుగోడలు ఉండవచ్చు కానీ.. బయట వాళ్లు దాడి చేయడానికి వస్తే మాత్రం అందరూ ఒక్కటే అవ్వాలి. అలా అయితే.. దేశం సమైక్యంగా ఉన్నట్లు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల.. కుల, మత అడ్డుగోడలు శాశ్వతమైనవిగా మారిపోయే ప్రమదం ఏర్పడుతోంది. సీఏఏ చట్టంపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో తాను ఇంప్లీడ్ అయ్యేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉలిక్కిపడిన కేంద్రం.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఐఐ భారత అంతర్గత వ్యవహారమని .. ఇది భారత సౌర్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని.. వాదించడం ప్రారంభించింది. విదేశీ ప్రమేయం సరికాదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడమే దౌర్భాగ్యం. ఇప్పుడు సీఐఐపై ఆందోళన చెందుతున్న వారు.. ఐక్యరాజ్య సమితిని ఆహ్వానిస్తారు. ఎందుకంటే.. తమదైన దేశంలో తమకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని.. వారు నమ్ముతున్నారు. రేపు వారికి అండగా ఉండేది ఐరాసనే అని.. వారు నమ్మే పరిస్థితి వచ్చేస్తోంది.
ప్రజలు చైతన్యవంతులవడమే “విభజన”కు విరుగుడు..!
దేశంమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. కానీ ఇప్పుడు.. అందరూ మట్టి మాత్రమే దేశం అనుకుంటున్నారు. ఆ మట్టిపై బతుకుతున్న మనుషుల్లో కొంత మందిని రాజకీయంగా వేరు చేస్తున్నారు. ఫలితంగా విభజన వచ్చేస్తోంది. ఇది రాజకీయంగా కొన్ని పార్టీలకు లాభమేమో కానీ దేశానికి మాత్రం తీవ్ర నష్టం. నాడు పాకిస్థాన్ విభజన ఎంత తప్పు అవుతుందో… ఆ రాచపుండు ఇప్పటికీ ఇండియాను ఎలా వెంటాడుతుందో.. దేశ ప్రజల్లో విభజన వస్తే.. అంతకంటే వినాశనం జరుగుతుంది.. ఇదంతా పాలకులకు తెలుసు… తెలుసుకోవాల్సింది ప్రజలే..!