తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చినప్పుడు ఓ మహిళా ఐఏఎస్ కన్నీరు పెట్టుకున్నారు. అవి ఆనందభాష్పాలు. ఆ భాష్పాల గురించి పేపర్లలో..మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చూసుకున్నారు. అంతే ఆమె జూనియర్ అయిపోయినా ఏకంగా సీఎంవోలోకు వెళ్లిపోయారు. అక్కడ పదేళ్ల పాటు చక్రం తిప్పారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేసి.. వేల మంది చేశారు..నేను చేశాను తప్పేముందని వాదిస్తున్నారు.
ప్రభుత్వ వ్యవస్థలో భాగమని భావించలేకపోతున్న స్మితా సభర్వాల్
స్మితా సభర్వాల్ ఐఏఎస్ అధికారిణి. టూరిజం శాఖ ఆమె చూస్తున్నారు. ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించేందుకు టూరిజం శాఖ నుంచి ప్రతిపాదనలు వస్తే ఆమె ట్రాక్ రికార్డు ఏమిటని చూడకుండా… ప్రభుత్వం అంగీకరించింది. ఆ పనిలో ఆమె ఉన్నారు. పనిలో పనిగా తన ఫ్యాషన్ ఆసక్తిని కూడా బాగానే బయట పెట్టుకుంటున్నారు. అయితే ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసి..తాను ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఒక్కరంటే ఒక్కరూ సమర్థించని వాదన
తాను షేర్ చేసిన ఫోటోను రెండు వేల మంది షేర్ చేశారని.. ఆ రెండువేల మందికీ నోటీసులు ఇవ్వకపోతే సెలక్టివ్ గా టార్గెట్ చేసినట్లేనని ఆమె ట్వీట్ చేశారు. ఆమె వాదనను ఒక్కరంటే ఒక్కరూ సమర్థించడం లేదు. ఎందుకంటే ఆమె ఐఏఎస్. ప్రభుత్వంలో భాగం. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం. క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవచ్చు.
వీఆర్ఎస్ తీసుకుంటే బెటర్
ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయాలని ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. కానీ వారు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అనిపిస్తే ఏ ప్రభుత్వమూ సహించదు. ఎన్నికలు ఐదేళ్లకోసారి జరుగుతాయి. అధికారులు శాశ్వతంగా ఉంటారు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే జయేష్ రంజన్ లా కలిసిపోతారు. కానీ పని తీరు కంటే ఎక్కువ ఎదిగిపోవాలనుకునే కొంత మందే విపరీత ఆలోచనలు చేస్తారు. స్మితా సభర్వాల్ ఇప్పుడు అలాంటి విమర్శలు ఎదుర్కొంటారు.