ఏది ఉచితమో.. ఏది సంక్షేమమో నిర్ణయించడం క్లిష్టమని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అశ్వనీకుమార్ ఉపాధ్యాయ అనే లాయర్ దాఖలు చేసిన ” ఉచితాల రద్దు ” పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. తాము అమలు చేస్తున్నవి ఉచితాలు కాదని.. సంక్షేమ పథకాలని వాదించాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు హామీలు ఇవ్వకుండా నిరోధించలేమని స్పష్టం చేసింది. అలాగే ఏది ఉచితమో.. ఏది సంక్షేమమో డిఫైన్ చేయలేమని కూడా అంచనాకు వచ్చింది. నిజానికి ఇలాంటి సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపిస్తుందేమో అనుకున్నారు. కానీ ఎలాంటి తీర్పు ఇచ్చినా అది పరిస్థితులకు తగ్గట్లుగా ఉండే అంచనా లేకపోవడంతో సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేకపోయింది.
చట్టాలు, తీర్పులు కాదు ఉచితాలపై రాజకీయ నేతల వైఖరే ఇక్కడ అసలు కీలకం. రాజకీయ అధికారం కోసం ప్రజల నుంచి పన్నుల రూపంలో పిండుతున్న నిధుల్ని ఓటు బ్యాంక్‌కు ఉచితాల రూపంలో పంచి పెట్టడం అనేది ప్రధాని మోదీ చెప్పినట్లుగా దేశాభివృద్ధికి ఆటంకం కలిగించేదే. అవసరమైన వరకూ ప్రజల సంక్షేమం చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కానీ నెలకు ఇంత చొప్పున డబ్బులిస్తామని చెప్పి.. ఆ మేరకు అప్పులు చేసి.. పన్నులు పెంచి డబ్బులు బదిలీ చేయడం మాత్రం ప్రజల్ని సోమరిపోతులను చేయడం ద్వారా దేశానికి నష్టం చేస్తున్నట్లవుతుంది. అయితే రాజకీయ పార్టీలు ఆ డబ్బులకు వివిధ పేర్లు పెట్టి ఆ వర్గాలు బాగుపడకూడదా అనే రాజకీయం చేస్తున్నాయి. దీంతో ఎవరూ రాజకీయ నేతల జోలికి వెళ్లే పరిస్థితి లేదు.
రాజకీయం అంటే ప్రజల బతుకుల్ని బాగు చేయడం. తమ బాగు కోసం వారిని భిక్షగాళ్లను చేయడం కాదు. రాజకీయ నేతలే దీన్ని తెలుసుకోవాలి. తమ అధికారం కోసం ప్రజల జీవితాల్ని అంధకారం చేసి.. తాము వేల కోట్లు కూడబెట్టుకుంటే వచ్చే ప్రయోజనమేంటో ఆలోచించాలి. ఓ స్థాయి దాటిన తర్వాతైనే.. ప్రజల కోసం పని చేయాలని ఆలోచించాలి. కానీ పాలకులు అలాంటి దృష్టిలో లేరు. ఏళ్ల తరబడి అధికారంలో ఉండటమే లక్ష్యంగా నగదు బదిలీ చేస్తున్నారు. దీనికి చట్టాలు… సుప్రీంకోర్టు తీర్పులు విరుగుడు కావు. పాలకులు.. రాజకీయ నేతల్లోనే మార్పు రావాలి.