ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇప్పటి వరకూ క్రిష్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఫలించాయి. నారా చంద్రబాబు నాయుడుగా రానా అచ్చుగుద్దినట్టు సరిపోయాడు. సుమంత్ అక్కినేనిగా ఒరిగిపోయాడు. ఇప్పుడు శ్రీదేవి లుక్ వచ్చింది. శ్రీదేవిగా రకుల్ కనిపించబోతోందని, బాలయ్య – రకుల్‌ల మధ్య ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటని మళ్లీ తెరకెక్కిస్తున్నారని – తెలుగు 360 ముందే చెప్పింది. ఈరోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆ పాట షూటింగ్ కూడా మొదలెట్టారు. షూటింగ్ ఇలా మొదలైందో లేదో.. అలా లుక్ కూడా బయటకు వదిలేశారు.
ఈ రోజు ఉదయమే శ్రీదేవిగా రకుల్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. శ్రీదేవి ని రీప్లేస్ చేయడం ఎవరికైనా కష్టమే. రకుల్ అయితే మరీ తేలిపోయినట్టు కనిపించింది. కొంతమంది ‘శ్రీదేవినా? శ్రీరెడ్డినా?’ అంటూ కౌంటర్లు కూడా వేశారు. సాయింత్రం బాలకృష్ణ – రకుల్‌లు కలిసి ఉన్న స్టిల్ ఒకటి విడుదల చేశారు. ఎన్టీఆర్‌గా బాలయ్య ని వంక పెట్టలేనంత బాగా మార్చేశాడు క్రిష్. ఇక్కడ మళ్లీ రకుల్ రూపమే కాస్త తేడా కొట్టింది. శ్రీదేవిగా రకుల్ మారలేకపోయింది. కనీసం చినుకులు పడుతున్నప్పుడు మొహాలు బ్లర్ అవుతాయి కదా? అప్పుడు కూడా `శ్రీదేవి`లా మాయ చేయలేకపోయింది రకుల్. ఇప్పటి వరకూ బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్స్‌లో రకుల్‌కే తక్కువ మార్కులు పడతాయి.
ముందే చెప్పినట్టు శ్రీదేవి పాత్రని రీప్లేస్ చేయడం ఎవరికైనా కష్టమే. రకుల్ కి ఇప్పుడు ఆ కష్టం ఎలాంటిదో తెలిసి ఉంటుంది. కనీసం నటన పరంగానైనా శ్రీదేవిని గుర్తుకు తెస్తే అదే పది వేలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.