వైఎస్ జగన్ బెంగళూరులో రెస్ట్ తీసుకుని మంగళవారం మళ్లీ తాడేపల్లి వస్తున్నారు. ఆయన వస్తున్నారు కాబట్టి భారీగా జన సమీకరణ చేయాలని కృష్ణాజిల్లా నేతలకు సందేశాలు వచ్చాయి మధ్యాహ్నం ఒకటిన్నరకు జగన్ ఎయిర్ పోర్టుకు వస్తారని.. జనం బాగా కనిపించేలా చూడాలని ఆదేశాలు రావడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ తన బాధ్యతగా.. ఆ సందేశాలను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. వచ్చిన వాళ్లు వస్తారు లేని వాళ్లు లేదనుకుంటారో.. ఓ రెండు, మూడు వందల మందినైనా తీసుకెళ్తారో మంగళవారం మధ్యాహ్నం తెలియనుంది.
జగన్ రెడ్డి ఏపీకి వస్తే ఎవరూ రాకపోతే జనాలు పట్టించుకోవడం మానేశారన్న ప్రచారం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ముందస్తుగా అలర్ట్ చేశారు. తనకు ఇంకా క్రేజ్ ఉందని చెప్పించుకోవాలని ఆయన తపన. అధికారంలో ఉన్నప్పుడు అందర్నీ బలవంతంగా తరలించేవారు. ఎన్నికల సమయంలో ర్యాలీలకు డబ్బులు ఇచ్చి తరలించారు. అయితే డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి రాయితో కొట్టడంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు జగన్ ర్యాలీలకు స్వాగతాలు చెప్పడానికి డబ్బులు ఇచ్చినా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏం జరిగినా తమపైనే కేసులు పెడతారని వారి భయం.
తాడేపల్లి వస్తున్న జగన్ ఎన్ని రోజులు అక్కడ ఉంటారో స్పష్టత లేదు. ఆయనకు ఉన్న భద్రతను పూర్తిగా సమీక్షించే అవకాశం ఉంది. పార్టీ కార్యాలయాన్ని కూడా ఇంట్లోకే మార్చుకున్నందున ఆయన తాడేపల్లిలో ఉన్నా సరే… బయటకు వచ్చే అవకాశాలు లేవు. చుట్టూ ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.