మహిళలపై నటుడు చలపతిరావు చేసిన వికృత వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఆయన కూడా కాస్త అటూ ఇటూ మాట్లాడినా చివరకు బేషరతుగా క్షమాపణలు చెప్పేశారు. కథ అక్కడికి అయిపోవలసింది. ఆ విషయమై మరెవరైనా విమర్శించినా అప్పటికే క్షమాపణ చెప్పారు గనక మళ్లీ వివాదాలకు ఆస్కారం వుండదు. కాని జరుగుతున్నదేమంటే ఆ తర్వాత జై చలపతి రావు తరహాలో ఒక బ్రిగేడ్ బయిలుదేరింది. చలపతి వ్యాఖ్యలు తప్పే గాని వాటిపై ఇంత దుమారం ఎందుకు? మరెవరూ తప్పు మాట్లాడరా అంటూ ఎదురుదాడి చేయడం ఈ బ్రిగేడ్ పనిగా పెట్టుకుంది.ఈ ఉదంతంలో భాగం పంచుకున్న సెలబ్రిటీ యాంకర్లు కూడా ఇదే నీతి చెబుతున్నారు. .చలపతిరావు కుటుంబ సభ్యులు సన్నిహితులు కొందరు కావాలనే ఈ ప్రహసనం నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. వారే చొరవ తీసుకుని స్టూడియోలకు వచ్చి మరీ ఆయనను సమర్థించి వెళుతున్నారు. అలాటి ఒకటి రెండు ఉదంతాలు నాకు స్పష్టంగా తెలుసు. ఇక మరో వైపున ఈ వూపులో కొందరు తమ స్వంత ప్రచారం చేసుకోవడానికి పాచికలు వేస్తున్నారు. సహజంగానే ఇలాటి రసవత్తర విషయాలు మాట్లాడటం ఇష్టమైన వారు కొందరుంటారు. మహిళలపై విరుచుకుపడ్డమే పురుష పుంగవుల కర్తవ్యంగా భావించే సంఘాల సారథులూ కొందరున్నారు. తమాషా ఏమంటే ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోవలసిన వివాదాన్ని ఇలాటి వారు మరింత సాగలాగడానికి కారణమైనారు. అలా అలా ఈ జుగుప్సాకర చర్చ సాగుతూనే వుంది.చలపతి రావు గతంలోనూ ఇలా మాట్లాడ్డం తెలుసని పరిశ్రమలో పండిపోయిన కొందరు స్పష్టంగా చెబుతున్నారు. రేప్‌ల గురించి ఆయన ఎంత అలవోకగా మాట్లాడారో ఒక ప్రసిద్ధ నాయిక పేరు పెట్టి మరీ ఆమెను ఎంతమంది రేప్చేశారో , అందుకు ప్రయత్నించారో తెలియదని ఆయన అనడం గతంలో గుర్తు చేశాను. కనుక సమస్య ఈ ఒక్క హీన వ్యాఖ్యమాత్రమే కాదు, ఆ ధోరణి. ఈ వాస్తవాలు గ్రహించి చలపతి బ్రిగేడ్ సమర్థనలు ఆపడం మంచిది.