వైఎస్ జగన్ బంధువుల్లో ఒకరు.. పులివెందుల నియోజకవర్గంలో చక్రాయపేట మండలం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ను బెదిరించారన్న కారణంగా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ కూడా వైసీపీ ఎమ్మెల్యేకు చెందినదిగా భావిస్తున్నారు.
పులివెందుల నియోజకవర్గం అంతా వైఎస్ కుటుంబీకుల చేతుల్లోనే ఉంటుంది. ఏ పనులు చేయాలన్నా వారే డిసైడ్ చేస్తారు. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఎంత పర్సంటేజీ ఇచ్చుకోవాలో ముందే డిసైడ్ అయిపోతుంది. అయితే ఇటీల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దీంతో పార్టీ నేతలు కట్టు తప్పుతున్నారు. దీంతో ఎవరేం చేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. తన మండలంలో తనకు తెలియకుండా.. పనులు చేయడంపై వైఎస్ కొండారెడ్డి ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది . పనులు అడ్డుకోవడంతో వారు పోలీసుల్ని ఆశ్రయించడం.. ఆయనను అరెస్ట్ చేయడం జరిగిపోయిాయి.
వైఎస్ జగన్ కుటుంబీకుడ్ని అదీ కూడా పులివెందులలో ఓ మండల బాధ్యతల్ని చూస్తున్న నేతను అరెస్ట్ చేయడం అంటే.. పై స్థాయిలో పోలీసులకు అనుమతి లభించి ఉంటుంది. అలాంటి అనుమతి ఇచ్చారంటే … వైఎస్ కొండారెడ్డిని ఇక వద్దనుకుంటున్నారని భావిస్తున్నారు. అయితే తల్లి తరపు బంధువులతో దూరం పెరుగుతున్న సమయంలో వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేయించడం .. కలకలం రేపుతోంది. ఈ పరిమామాలపై పులివెందుల వైసీపీలో చర్చ జరుగుతోంది.