వైసీపీ అధికారంలో ఉంటే కబ్జా చేయాలనుకునే ప్రతి వైసీపీ నాయకుడు కలెక్టరే. సంతకాలు సులువుగు ఫోర్జరీ చేసేసుకుని భూములు రాసేసుకోవచ్చు. ఎవరూ ఏమీ చేయరన్న దైర్యంతో అందరూ కలిసి పులివెందులలో చేసిన భారీ భూబాగోతం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఎపిసోడ్లో చివరికి కలెక్టర్ సంతకం కూడా ఫోర్జరీ అయినట్లుగా గుర్తించారు.
సీఎం జగన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల పలు చోట్ల 35 ఎకరాల చుక్కల భూములకు ఎన్వోసీలు జారీ అయ్యాయి. ఇవన్నీ చుక్కల భూములు. చుక్కల భూములకు జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలు సృష్టించారు. ఈ ఎన్వోసీల ద్వారా చుక్కల భూములను పులివెందుల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒకరి పేరు నుంచి మరొకరి పేరున రిజిస్ర్టేషన్ చేశారు. భూములు రిజిస్టర్ కావడంతో చుక్కల భూముల నుంచి పట్టా భూమిగా మారిపోయింది. ఇదంతా గుట్టుగా సాగిపోయింది.
వెంటనే ఆ భూముల్లో లే అవుట్లు వేసి ఇళ్ల ప్లాట్లు విక్రయించి కోట్లు వెనకేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ విషయం కలెక్టర్ కార్యాలయంలో గుప్పుమంది. దీంతో కలెక్టర్ కార్యాలయం నుంచి పులివెందుల ఆర్డీవో కార్యాలయానికి సమాచారం వచ్చింది. కానీ హఠాత్తుగా అధికారులు హడావుడి ప్రారంభించారు. అవి తప్పుడు రిజిస్ట్రేషన్లు అని కలెక్టర్ కార్యాలయం అప్రమత్తమయింది. కలెక్టర్ కార్యాలంయ ఆదేశాలతో ఆర్డీవో విచారణ చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారులు.. రియల్ఎస్టేట్ బ్రోకర్లు, వైసీపీ నేతలతో చేతులు కలిపి నకిలీ ఎన్వోసీలు సృష్టించారని గుర్తించారు.
ఈ వ్యవహరంలో ప్రభుత్వం పరువుపోయే అవకాశం ఉండటంతో పోలీసులు నోరు మెదపడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దొంగపనులు చేయడం ఓ అర్హతగా ఉంది కాబట్టి… నిందితుల్ని కాపాడి… అధికారుల్ని బలి చేస్తారో… లేకపోతే తప్పేం జరగలేదని చివరికి తేలుస్తారో చూడాల్సి ఉంది.