విశాఖలో విప్రో భవనాన్ని అద్దెకు తీసుకుని అదే సంస్థపై కేసు పెట్టాడు పల్సస్ సంస్థ సీఈవో శ్రీనుబాబు. విప్రో వల్ల తనకు రూ.103 కోట్ల నష్టం వచ్చిందని కోర్టుకెళ్లారు. కింది కోర్టుల్లో ఎక్కడా అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టుకెళ్లారు. అక్కడ ఆదేశాలు వచ్చాయని చెప్పి విప్రోపై పై కేసు పెట్టించారు.
రెండు దశాబ్దాల కిందట విప్రోకు విశాఖలో ఏడు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అందులో నాలుగు ఎకరాల్లో భవనాలు నిర్మించింది కానీ విప్రో ఆఫీసులు ప్రారంభించలేదు. వాటిలో ఓ భవనాన్ని పల్సస్ కోసం గేదెల శ్రీనుబాబు లీజుకు తీసుకున్నారు. ఇటీవల ఆ సంస్థ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఉద్యోగుల పీఎఫ్ కూడా చెల్లించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో భవనాన్ని లీజుకు ఇచ్చిన విప్రో వల్లనే తనకు నష్టం అని ఆయన కేసు పెట్టారు.
విప్రో భవనం ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో లేదని అందువల్ల తాను విదేశాలకు ఐటీ ఎగుమతుల్ని చేసి పన్ను మినహాయింపు పొందలేకపోయానని ఆయన వాదన. సెజ్ పరిధిలో ఉందో లేదో లీజుకు తీసుకున్నప్పుడే ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన నిండా మునిగిపోయాక.. తన లాసలకు కారణం విప్రో అని ఆ సంస్థను బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.