ఓమిక్స్ పేరుతో పల్సస్ అనే కంపెనీని నడుపుతూ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లో చేరి రాజకీయాలు చేసే గేదెల శ్రీనుబాబు అనే వ్యక్తి ఉద్యోగుల్ని నిండా ముంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును పక్కదారి పట్టించడంతో ఖాతాను నిలుపుదల చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు.
పల్సస్ అనే కంపెనీ సాఫ్ట్ వేర్ అని చెబుతారు కానీ అది సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు. కొన్ని జర్నల్స్ లో పరిశోధన ఆర్టికల్స్ ప్రచురించే కంపెనీ. సెమినార్లు నిర్వహించి నిపుణులు చెప్పే విషయాలను ఆర్టికల్స్ గా ప్రచురిస్తామని చెబుతారు.అయితే ఆ కంపెనీ కార్యకలాపాలపై స్పష్టత లేదు. ఉద్యోగులకు కూడా చాలా చిన్న స్థాయిలో జీతాలు ఇస్తారని అంటున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ పీఎఫ్ కూడా జమ చేయడం లేదని తేలడంతో శ్రీనుబాబు వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
పెద్ద ఎత్తున సెజ్‌లు పెడతానని .. ఆఫీసులు పెడతానని.. వందల కోట్లు పెట్టుబడులు పెడతానని శ్రీనుబాబు ప్రచారం చేసుకుంటారు. మొదట జనసేనలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో ఆయనకు విశాఖ ఎంపీ టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఆయన వైసీపీలో చేరిపోయారు. తర్వాత వైసీపీలో ఎలాంటి పదవులు లేవు కానీ అధికార పార్టీ కాబట్టి కొనసాగారు. ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ నేతగా అవతారం ఎత్తారు. పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకున్నారు. అయితే ఆయనకు ఏ అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆయన కంపెనీ రిస్క్ లో పడింది. ఏం చెబుతారో చూడాల్సి ఉంది.