అధికారం ఉన్నప్పుడు భయపెట్టి.. అధికారం పోయినప్పుడు భయపడే రాజకీయ నాయకుడి చుట్టూ ఎవరూ ఉండరు. అధికారం ఉన్నప్పుడే ఉంటారు. అధికారం పోయాక ఆయనతో పాటు తాము ఎందుకు బలి అవ్వాలని సైడ్ అవుతారు. పుంగనూరులో ఇప్పుడు అదే జరుగుతోంది. పెద్దిరెడ్డి తాను అధికారంలో ఉన్నంత కాలం ఎవరూ పుంగనూరు రాకుండా చుట్టూ రాళ్ల కుప్పలతో సైన్యాన్ని రెడీగా ఉంచేవారు. అధికారం పోయాక ఇప్పుడు ఆ రాళ్లే తనపై పడతాయని భయంతో నియోజకవర్గానికీ వెళ్లడం లేదు.
ఆయనే భయపడిపోతే ఇక తాము మాత్రం వైసీపీలో ఎలా ఉండగమని క్యాడర్ అంా టీడీపీలోచేరిపోతున్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు అంతా కట్ట కట్టుకుని టీడీపీలో చేరిపోయారు. మున్సిపల్ చైర్మన్ కూడా చేరిపోయిన వారి జాబితాలో ఉన్నారు. వైసీపీలో ఉన్నా సరే వాళ్ల పదవులకేం డోకాలేదు. కానీ పెద్దిరెడ్డే రాకపోతూండే సరికి తట్టుకోలేమని వెళ్లిపోతున్నారు. టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు ఇప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పుడు పుంగనూరులో పర్యటించే పరిస్థితి లేదు. ఆయన వస్తే ఆయన బాధితులు రాళ్లతో దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన విజయవాడ, హైదరాబాద్ లలో ఉంటున్నారు.ఇలా ఎంత కాలమో కానీ.. గతంలో పెద్దిరెడ్డి చేసిన అరాచకాలకు ఆయనకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు పుంగనూరులోని ఆయన వ్యతిరేక పార్టీలు రెడీ అయ్యాయి.