పుంగనూరులో ఎస్పీ రిషాంత్ రెడ్డి కుట్రకు పోలీసుల్ని బలి చేయడమే కాకుండా ఇప్పుడు టీడీపీపై కేసులు పెట్టడానికి కూడా కింది స్థాయి పోలీసుల్నే పావులుగా వాడుకుంటున్న వైనం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు పెట్టారో కానీ… బయటకు వచ్చిన ఏడెనిమిది కేసుల్లో ఫిర్యాదు దారులంతా పోలీసులే. కింది స్థాయి కానిస్టేబుళ్లతో ఫిర్యాదులు చేయించి టీడీపీ నేతలందరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్న వైనం పోలీస్ శాఖలో సంచలనం అవుతోంది.
తాజాగా చంద్రబాబును వదిలి పెట్టడం ఎందుకని ముదివీడు అనే పోలీస్ స్టేషన్ లో ఓ కేసు పెట్టారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, ఏ3గా అమర్నాథ్ రెడ్డి,ఏ4 గా చల్లాబాబులపై కేసు నమోదు చేశారు. పోలీసులు పెడుతున్న కేసులన్నింటినీలోనూ భవిష్యత్లో వైసీపీ నేతలకు ఇబ్బంది లేకుండా పోలీసులతోనే ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చల్లా బాబు పులివర్తి నాని వంటి వారందర్నీ నిందితులుగా పెట్టి ఏడు కేసులు పెట్టారు. మంగళవారం రోజు మరో రెండు కేసులు నమోదు చేశారు. చివరికి అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల తో ఫిర్యాదు చేయించి కూడా కేసులు నమోదు చేశారు.
పుంగనూరులో ఏం జరిగిందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతపై రాళ్లు వేస్తూంటే పోలీసుల చూస్తూనే ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు చెలరేగేలా చేసి… పోలీసులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇదంతా టీడీపీ నేతలపై కేసులు పెట్టించడానికి వైసీపీ నేతలతో కలిసి ఎస్పీ రిషాంత్ రెడ్డి చేసిన కుట్రగా అనుమానిస్తున్నారు. అయితే అసలు ఈ ఇష్యూలో ఎక్కడా వైసీపీ అనే ప్రస్తావన రాకుండా… వారు చేసిన దాడుల గురించి తెలియకుండా.. మొత్తం పోలీసులే తమ మీద వేసుకుని రాజకీయం చేస్తున్నారు.
పోలీసుల వ్యవహారశైలి చూస్తూంటే… ఇక వారు వైసీపీలో కలిసిపోయారేమోన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంత దారుణంగా వ్యవస్థను బలహీనం చేస్తున్న పోలీసులు.. చివరికి తమకూ రక్షణ లేకుండా చేసుకుంటున్నారన్న ఆందోళన … సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.