అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్… పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే సిద్ధూ పార్టీని సర్వం భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆ పదవి కూడా తనకు వద్దని రాజీనామా చేసేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయిన సిద్దూ తనకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.
దానికి సీఎం అమరీందర్ సింగ్ అంగీకరించలేదు. అసంతృప్తి కార్యకలాపాలు చేసి చేసి చివరికి పంతం నెగ్గించుకున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఓపిక పట్టి ఉంటే ఆయన నేతృతవంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉంటే సీఎంపదవి ఆయనకే దక్కేది. అమరీందర్‌కు అప్పటికే పార్టీలో మద్దతు తగ్గిపోయింది. అయితే కారణం ఏదైనా కానీ అమరీందర్ రాజీనామా చేసేవరకూ తగ్గలేదు. చివరికి దళిత నేతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అయినా పరిస్థితులు సద్దు మణగలేదు. కెప్టెన్ అమరీందర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన అమిత్ షా అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
దీంతో మరోసారి కలకలం రేగింది. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సిద్ధూ ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. ఏం చేయలేని నిస్సహాయ స్థితికి కాంగ్రెస్ హైకమాండ్ చేరిపోయింది.