ఈరోజుల్లో కార్పొరేటర్లు కూడా కార్లు, బంగ్లాలు కలిగి ఉంటారు. వారు అడగకపోయినా ఖరీదైన బహుమతులు అందుకొంటుంటారు..దేశావిదేశాలకి విహార యాత్రలు చేసివస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు అయితే ఇక చెప్పనవసరమే లేదు. అందరూ కోటీశ్వరులే! కానీ పంజాబ్ లో హోషియార్ పూర్ జిల్లాలోని ఘర్ శంకర్ అనే పట్టణంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శింగార రామ్ షాహుంగ్రా కుటుంబం తలదాచుకోవడానికి చిన్నఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. మొన్నటి వరకు ఆయన కుటుంబం రాష్ట్ర నీటిపారుదల శాఖకి చెందిన క్వార్టర్ లో నివసించేది. దానిలోంచి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించడంతో, వారు ప్రస్తుతం పట్టణంలో రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకొని ఉంటున్నారు.
దళిత జాతికి చెందిన శింగార రామ్ షాహుంగ్రా ఘర్ శంకర్ నియోజక వర్గం నుంచి బి.ఎస్.పి తరపున 1992, 1997 సం.లలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పదేళ్ళ వ్యవధిలో తన కుటుంబం కోసం చిన్న ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయారు. ఎందుకు అని ప్రశ్నిస్తే, ఎమ్మెల్యేగా నాకు వచ్చే జీతంలో ఇల్లు నిర్మించుకోలేకపోయానని అమాయకంగా చెపుతున్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబం ఆ ప్రభుత్వ క్వార్టర్ లోనే నివసిస్తోంది. అధికారులు ఖాళీ చేయించడంతో ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డున పడింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినందుకు తనకు నెలకి రూ.20,000 పెన్షన్ వస్తుందని, అదే నలుగురు సభ్యులున్న తన కుటుంబానికి ఆధారమని చెప్పారు. ఎక్కడైనా తక్కువ అద్దెతో ఇల్లు దొరుకుతుందేమోనని వెతుకుతున్నామని చెప్పారు. అంతవరకు ఈ వర్షాకాలంలో రోడ్డు పక్కన టెంట్ క్రింద ఉండక తప్పదని అన్నారు. ఇరుగుపొరుగు వారిని బ్రతిమాలుకొని వారి బాత్రూములని వాడుకొంటున్నారు.
మరో విశేషం ఏమిటంటే ఆయన సోదరుడు నేటికీ తాపీ మేస్త్రిగా పని చేస్తున్నారు. అందరికీ ఇల్లు నిర్మిస్తున్న ఆయనకీ తలదాచుకొనేందుకు స్వంత ఇల్లు లేదు.
దేశంలో బడుగు బలహీన వర్గాలు, దళితులందరిపై గుత్త హక్కులు పొందినట్లు మాట్లాడే బిఎస్పి అధినేత్రి మాయావతి కూడా తన పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి పట్టించుకోలేదు. నిజానికి ఆమే శింగార రామ్ షాహుంగ్రా పార్టీ నుంచి బహిష్కరించారు. శింగార రామ్ షాహుంగ్రా చెప్పిన కారణం వింటే షాక్ అవకమానము. మాయావతి తను దళితనేత స్వర్గీయ కాన్షిరాం వారసురాలిగా చెప్పుకొంటూ ఆయన విగ్రహాల పక్కనే బ్రతికుండాగానే తన విగ్రహాలు కూడా పెట్టించుకొన్నారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన విభేదాలు తలెత్తడంతో ఆయనకి దూరం అయ్యారు. ఆయన అంతిమ ఘడియలలో ఆయన కుటుంబానికి శింగార రామ్ షాహుంగ్రా అండగా నిలబడటంతో మాయావతి ఆగ్రహించి పార్టీ నుంచి తనను పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పారు. అప్పటి నుంచి తన పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
బహుశః మన దేశంలో నేటి తరం ప్రజాప్రతినిదులలో ఏ ఒక్కరూ ఇటువంటి దుస్థితి ఎదుర్కొన్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేధింపులు తాళలేక వేముల రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు, అతను దళితుడని తెలియగానే దేశం నలుమూలల నుంచి రాజకీయ నాయకులు వచ్చి యూనివర్సిటీలో వాలిపోయి మొసలి కన్నీళ్లు కార్చి వెళ్లిపోయారు. ఒక నిజాయితీపరుడైన దళిత ఎమ్మెల్యే తన కుటుంబంతో సహా రోడ్డున పడితే పట్టించుకొనే నాధుడే లేడు.