వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉన్నట్లు సామాజిక, రాజకీయ పరిశోధనలు జరుపుతున్న హైదరాబాద్ కు చెందిన పరిశోధన సంస్థ “ప్యూపిల్స్ పల్స్” అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ఈ సంస్థ బృందం పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత సంస్థాగతంగా ఏర్పడిన చీలికలు, పలువురు నాయకుల బహిష్కరణ వంటి పలు ఎదురు దెబ్బలు తింటున్నా 2014 లోక్ సభ ఎన్నికలలో నెలకొన్న ఆప్ అనుకూల వాతావరణం ఇప్పుడు కూడా కొనసాగుతున్నదనే అభిప్రాయానికి వచ్చింది.
పంజాబ్ లోని మూడు ప్రాంతాలలో కూడా తీవ్రమైన అకాలి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించడంతో పాటు అత్యధిక నియోజక వర్గాలలో ఎవ్వరు అకాలి లను ఓడించగలిగితే వారికి వోట్ వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లభిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొనే పరిస్థితులలో లేకపోవడంతో ఆప్ వైపే మొగ్గు కనిపిస్తున్నట్లు ప్యూపిల్స్ పల్స్ భావిస్తున్నది.
యువత ఏదురుకొంటున్న నిరుద్యోగ సమస్య, సంస్థాగత అవినీతి లతో పాటు సాంప్రదాయంగా అకాలి దళ్ తో ఉంటున్న జాట్-సిఖ్ లోని ఒక వర్గంలో `మార్పు-కొత్త పార్టీ’ పట్ల ఆకర్షణ ఈ సందర్భంగా ఆప్ కు కలసి రానున్నాయి.
పైగా 2015లో గురు గ్రంథ సాహిబ్ గ్రంధాన్ని అపవిత్రం చేయడం, ఆ తరువాత నిరసన తెలుపుతున్న సిఖ్ లపై జరిగిన పోలీస్ కాల్పులు మత భావాలు గల జాట్-సిఖ్ ఓటర్లలో ఆగ్రహం కలిగించడంతో పాటు ఆప్ ను `నూతన అకాలి గా చూడటం జరుగుతున్నది.
సరిహద్దు జిల్లాలతో పాటు ముఖ్యంగా మాల్వా, మాఝా ప్రాంతాలకు విస్తరించిన `మాదక ద్రవ్యాల ప్రమాదం హరిత విప్లవం తరువాతి వ్యవసాయ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నది. పలు గ్రామాలలో ఒక తరాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. ఈ అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారానికి ఆకాలి నాయకులు అండగా ఉంటున్నట్లు ప్రజలు భావించడం, ఈ అంశాన్ని చేపట్టడం పట్ల కాంగ్రెస్ విముఖంగా ఉండటం, ఆప్ ఒక సీనియర్ మంత్రి పేరును ఉదహరిస్తూ తీవ్రంగా ధ్వజం ఎత్తుతూ ఉండటంతో ఆప్ – కాంగ్రెస్ ల మధ్య ప్రజలు ఆప్ వైపు మొగ్గు చూపడానికి దారితీస్తున్నది.
పంజాబ్ లో అత్యధికంగా 32 శాతం మంది దళిత్ లు ఉన్నారు. అయితే చెప్పుకోదగిన బలమైన నాయకుడు వారికి లేరు. ప్రస్తుత ప్రభుత్వం వీరి కోసం విస్తృతంగా సంక్షేమ, మతపర కార్యక్రమాలను అమలు జరపుతున్నది. తద్వారా అత్యధికంగా కాంగ్రెస్ కు వేస్తున్న వీరి ఓట్లలో ఇప్పుడు చీలిక ఏర్పడే అవకాశం ఏర్పడింది.