ఒక్కడు తప్పతాగి కారు నడిపిన ఫలితం. నాలుగు కుటుంబాలను కకావికలం చేసింది. ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని జీవచ్ఛవాల్లా మార్చింది. ఈనెల 1వ తేదీన హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడిన ఎనిమిదేళ్ల చిన్నారి రమ్య ఓడిపోయింది. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచింది.
తాగిన మైకంలో ఓ మైనర్ యువకుడు, మరో ఐదుగురు ఫ్రెండ్స్ తో కలిసి అతివేగంగా కారును నడిపాడు. బారులో తప్పతాగి కారులో బయల్దేరిన తర్వాత కారు వేగం పెరడంతో అదుపు తప్పింది. కంట్రోల్ చేయలేకపోయాడు. నాగార్జున సర్కిల్ సమీపంలో ఆ కారు, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. అలాగే దూసుకుపోయి ఆ కారుపైకి ఎక్కేసిందంటే ఎంత ర్యాష్ డ్రయివింగ్ అర్థమవుతుంది.
ఆ ప్రమాదంలో రమ్య బాబాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రమ్య తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఆమెను బతికించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే ప్రమాదంలో రమ్య తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు, రమ్య తాతయ్య, మరో బాబాయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ల పరిస్థితి జీవచ్ఛవాల్లా మారిపోయింది. ఆ రోజు ఆ కారులో రమ్య తండ్రి, చెల్లి లేరు. అలా బతికిపోయారు. ఆదివారం సాయంత్రం అంబర్ పేట శ్మశాన వాటికలో రమ్య అంత్యక్రియలు జరిగాయి.
మైనారిటీ తీరని, డ్రయివింగ్ లైసెన్స్ లేని ఆ జులాయికి తల్లిదండ్రులు కారు ఎలా ఇచ్చారని రమ్య బంధువులు ప్రశ్నిస్తున్నారు. మైనారిటీ తీరని వాళ్లకు మద్యం సర్వ్ చేసిన బార్ పై ఏ చర్య తీసుకున్నారనే ప్రశ్నకు పోలీసులు నీళ్లు నములుతున్నారు. చివరకు, ఆ బార్ కు నోటీస్ జారీచేశామని జవాబు చెప్పారు. ఈ కేసులో నిందితుడికి కచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. నిందితుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్ని ఆధారాలు పక్కాగా సేకరించినట్టు పోలీసులు తెలిపారు.