ఏపీ బీజేపీలో పెద్దగా నేతలు లేకపోయినా ఉన్న వారి మధ్య పొసగడం లేదు. ఇప్పటికే రావెల కిషోర్, కన్నా లక్ష్మినారాయణ వంటి వారు గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో సీనియర్ నేత పురంధేశ్వరి కూడా అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు తీరుపైనే ప్రధానంగా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పురందేశ్వరి కూడా జీవీఎల్ తీరును తప్పు పడుతూ.. చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కొన్ని రోజుల నుంచి కాపుల విషయంలో మాట్లాడుతున్న జీవీఎల్ ఈ క్రమంలో ఇతర నేతల్ని కించ పరుస్తున్నారు. ఇతర నేతలు ఎవరో అయితే సరే కానీ.. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే పెడతారని… రంగా పేరు ఎందుకు పెట్టరని వాదిస్తున్నారు. ఆ ఇద్దరు అంటే టీడీపీ ఉంటే ఎన్టీఆర్.. వైసీపీ ఉండే వైఎస్ఆర్ అని జీవీఎల్ అర్థం. ఇలా మాట్లాడటం పురందేశ్వరికి నచ్చలేదు.. ఆ ఇద్దరు కాదని.. ఆ ఇద్దరు మహానుభావులు అనాలని కౌంటర్ ఇచ్చారు.
ఆ ఇద్దరి పేర్లేనా అనే దానికి కూడా కౌంటర్ ఇచ్చారు పురంధేశ్వరి. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం అందించారని తెలిపారు పురంధేశ్వరి. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందించారని గుర్తు చేశారు. మరొకరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారని పేర్కొన్నారు.
జీవీఎల్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఆయన హైకమాండ్ పుట్టించిన నాయకుడు. అయితే ఆయన ఇప్పుడు ఏపీలో కాపు నేతగా ఎదగాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యవహారాలు వివాదాస్పదం అవుతున్నాయి.