హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్లో క్రమక్రంగా బలం పుంజుకుంటోందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ మైనారిటీ మోర్చా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. విజయవాడలో మొన్న బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు కేటాయించిన నిధులపై వివరణ పత్రాలు సమర్పిస్తే కేంద్రం మరిన్ని నిధులు సమకూరుస్తుందని చెప్పారు. కేంద్రం కేటాయించిన నిధులను సరిగా వినియోగించుకున్నారా, లేదా అనే విషయంపైకూడా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అందరి మనసుల్లో ఉన్నప్పటికీ, హోదా ఇవ్వటానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నందున, హోదా ఇవ్వకపోయినా దానికి సమానంగా నిధులను ఏపీకి ఇవ్వటానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఏ ఒక్క వర్గానికోసమో రూపొందించలేదని, సబ్కే సాత్ – సబ్కా వికాస్ అనే విధానంలో అందరినీ అభివృద్ధిలో కలుపుకుపోవటంకోసమే రూపొందించారని అన్నారు. రచయితలు అవార్డ్లను వెనక్కి తిరిగి ఇవ్వటం సరికాదని, ఇది వారిని వారు కించపర్చుకోవటమేనని అన్నారు. మొత్తానికి చిన్నమ్మ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో సంచలనాలు సృష్టించేటట్లే ఉంది. ప్రస్తుతం తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ, ఆ ఎన్నికల సమయానికి ఏపీలో గణనీయమైన శక్తిగా ఎదిగి సొంతంగా బరిలో దిగాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వ్యూహాలు పన్నుతున్న సంగతి తెలిసిందే.