ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై, కార్పొరేషన్ల రుణాలపైనా, ఆస్తులు తనఖా పెట్టి తెచ్చిన అప్పులు , ఇతర సావరీన్ గ్యారంటీలను అన్నింటినీ పరిశీలించి ఆర్థిక స్థితి పైన ఫోరన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్క మరోసారి లేఖ రాశారు. విజయవాడ వచ్చిన ఆర్థిక మంత్రికి ఈ లేఖ ఇచ్చారు. ఇందులో ఏపీ అప్పులపై.. కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్ కు ఇస్తున్న తప్పుడు సమాచారం గురించి కూడా నేరుగానే చెప్పారు.
ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులు 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్కలను పార్లమెంట్ కు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిందని.. దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ.. ఏపీ బీజేపీని ప్రజల్లో చులకన చేస్తున్నారని కూడా లేఖలో నిర్మలా సీతారామన్‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు వినియోగించుకున్న కాంట్రాక్టర్లకు, సేవలకు, సప్లయర్లకు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల పైన చెల్లించాల్సిన బాధ్యతకు సంభంధించి కోర్టుల నుండి ఆదేశాలున్నా కూడా గత నాలుగు సంవత్సరాలుగా చెల్లింపులు చేయలేని దయనీయ స్థితిలోకి రాష్ట్రాన్ని తెచ్చారని గుర్తు చేశారు.
ఆదాయం 90 వేల కోట్లు కూడా లేకపోతే.. ఏటా లక్ష కోట్లకుపైగా అప్పులు చేస్తున్నారని ఎలా ఎలా చేయగలుగుతున్నారని పురందేశ్వరి ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్ మరియు అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు అయితే, సగటున ఏడాదికి 8% వడ్డీ అనుకున్నా కూడా వడ్డీ మాత్రమే 88 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ అప్పు రాబోయే 30 సంవత్సరాల్లో తీర్చాలన్నా సంవత్సరానికి కనీసం 36 వేల కోట్లు అవసరమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీ ఎప్పటికీ కోలుకోలేదన్నారు. మద్యం విషషయంలో భారీ స్కాం జరుగుతోందని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ చేయించాలని కోరారు.
నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి ఇప్పటికి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. కానీ.. తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.., పార్లమెంట్ కు సైతం అరకొర సమాచారమే ఇస్తున్నారు నిర్మలా సీతారామన్. అయినా తప్పదన్నట్లుగా మరోసారి అదే తరహాలో లేఖ రాశారు పురందేశ్వరి.