అల్లు అర్జున్ ఇష్యూలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తప్పేనని వాదించడం బీజేపీకి తప్పదు. అందుకే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో మాట్లాడిన బండి సంజయ్.. అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. టాలీవుడ్ పై పగబట్టినట్లుగా రేవంత్ ప్రవర్తన ఉందని విమర్శించారు. అసెంబ్లీలో సినిమా లెవల్లో సమస్యను సృష్టించడం సిగ్గుచేటన్నారు. సినిమా పరిశ్రమలకు ఇబ్బందులు సృష్టించడం మంచిది కాదన్నారు. ఏపీలో ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలంగాణ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఘటనలో ఏ లెవన్గా ఉన్న అర్జున్ ను అరెస్టు చేయడం కాదన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అందులో అర్జున్ పాత్ర ఎంత ఉందని ప్రశ్నించారు.
ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంది.ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకుని అల్లు అర్జున్ ను సమర్థిస్తోంది. రేవంత్ వేధిస్తున్నారని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు కూడా అర్జున్ కు సపోర్టుగా వస్తున్నారు. నిజానికి ఇలాంటి రాజకీయం వల్లే ఆ సమస్య అంతకంతకూ పెరుగుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది. కానీ పరిస్థితి రాజకీయం చేతుల్లోకి వెళ్లిపోయింది కాబట్టి ఎవరూ ఏం చేయలేరని అనుకోవచ్చు.