ఆంధ్రాకు మీరు చేసింది చెప్పమంటే… కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని భాజపా నాయకులు పురందేశ్వరి అంటున్నారు! తాజాగా ఓ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ… యథావిధిగా టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏ రాష్ట్రానికీ చేయనంత సాయం చేస్తూ, ఇంకోపక్క అభాండాలు మోసే పార్టీ భాజపా తప్ప మరొకటి ఉండదన్నారు! విభజన చట్టంలోని దగ్గర దగ్గర 85 నుంచి 90 శాతం వరకూ కూడా అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించిన అంశం ప్రజలు గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ప్రతీపైసా కేంద్రం నుంచే వస్తోందనీ, ఒకవేళ కేంద్రం సాయం చేయకపోతే పోలవరం పనులు జరిగేవా అనే అంశాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు.
యూసీలను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదు కాబట్టే, రావాల్సిన నిధులకు అక్కడ కొంతమేర ఇబ్బంది కలుగుతోందన్నారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలే తప్ప, శాశ్వత కట్టడాలేవీ లేవని పురందేశ్వరి విమర్శించారు. కేంద్రం రూ. 15 వందల కోట్లు మాత్రమే రాజధాని నిర్మాణానికి ఇచ్చిందని అంటున్నారనీ, కానీ ఆ సొమ్ము ఇచ్చింది తాత్కాలిక నిర్మాణాల కోసం కాదని ఆమె చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలది అనైతిక కలయిక అంటూ ఆమె అభిప్రాయపడ్డారు. భావసారూప్యత లేని అనైతిక కలయికను ప్రజలు ఆమోదిస్తారని తాము భావించడం లేదన్నారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంకిత భావం కాంగ్రెస్ కి ఉండి ఉంటే… బిల్లులో దాన్ని ఎందుకు పొందుపరచలేదన్నారు. అదే ప్రశ్నను ఈరోజున ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి కదా అన్నారు.
ఏపీ హోదాకి భాజపా ఏం చేసిందో చెప్పకుండా, అదే ప్రశ్నను కాంగ్రెస్ ను అడగమంటారేంటి..? విభజన సక్రమంగా కాంగ్రెస్ చేయలేదు కాబట్టే గత ఎన్నికల్లో ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయింది. ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో ఆ పార్టీకి ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. గడచిన నాలుగున్నరేళ్లూ భాజపా అధికారంలో ఉంది కదా… హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు..? విభజన చట్టంలో లేనివి కూడా ఆంధ్రాకు ఇచ్చేశామని అంటున్నారు కదా! అదే క్రమంలో హోదా ఎందుకు ఇవ్వలేకపోయారు..? ప్రతీరోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఏపీ భాజపా నేతలు మాట్లాడుతున్నారే తప్ప… వాటిల్లో వాస్తవాలేంటీ, కేంద్రం నుంచి వచ్చిన ప్రయోజనాలేంటీ, తమ నుంచి ప్రజలు ఆశిస్తున్న సమాధానాలేంటీ… ఇవేవీ వారికి పట్టవేమో. విభజన చట్టంలోని హామీలు ‘దగ్గర దగ్గర’ అన్నీ అమలు చేశారంటారు పురందేశ్వరి. ఈ దగ్గర దగ్గరేంటి..? పోలవరం కోసం ప్రతీపైసా కేంద్రం నుంచే వస్తోందట! కరెక్టే, కానీ రాష్ట్రానికి రావాల్సిన చెల్లింపులు మాటేంటి? కాంగ్రెస్, టీడీపీల కలయిక అనైతికం అంటున్నారు, ఆ పరిస్థితి భాజపా వల్ల ఉత్పన్నమైందా కాదా..?