పోలవరంపై ఇటీవలి కాలంలో తలెత్తిన అనుమానాలన్నీ ఒక్కోటిగా నివృత్తి అయ్యాయనే వాతావరణమే కనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా.. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత దూరం పెరుగుతోందనీ, భాజపా టీడీపీలూ ఎవరికివారు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారనే చర్చపై కూడా కొంత స్పష్టత వచ్చింది. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామనీ, పెండింగ్ ఉన్న అన్ని అంశాలపైనా సత్వరమే స్పందిస్తామని తాజాగా కేంద్రం భరోసా ఇచ్చింది. టెండర్ల వివాదంపై కూడా స్పష్టత ఇచ్చింది. విడుదల చేయాల్సిన బిల్లుల విషయంలో కూడా స్పష్టత వచ్చేసింది. దీంతో పోలవరం విషయమై భాజపా – టీడీపీల మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవనే పరిస్థితే కనిపిస్తోంది. అయితే, ఏపీ భాజపా నేతలు మాత్రం పోలవరం అంశమై టీడీపీపై ఇంకా ఆరోపణలు తగ్గించకపోవడం విశేషం!
భాజపా నాయకురాలు పురందేశ్వరి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నవి అన్నీ తప్పుడు లెక్కలే అని ఆరోపించడం విశేషం! కేంద్రానికి సరైన లెక్కలు చూపించడం లేదనీ, ఇంకోపక్క కేంద్రంపై విమర్శలు కూడా ఆపడం లేదని ఆమె అన్నారు. నిధుల జాప్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఖరే అన్నారు. సరైన లెక్కలు పంపి ఉంటే నిధులు అవే వస్తాయన్నారు. నిర్మాణం మందకొడిగా సాగడానికి కారణం కేంద్రం తీరు అని రాష్ట్ర నేతలు ఆరోపిస్తుండటం సరికాదనీ, దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. తాము రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నామనీ, అయినాసరే టీడీపీ తమతో ఎలాంటి సమాచారం పంచుకోవడం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ప్రతీ పైసా కేంద్రమే భరిస్తుందనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మించే సత్తా ట్రాన్స్ ట్రాయ్ కి లేదన్నారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కోరడం వల్లనే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్రానికి కేంద్రం అప్పగించిందన్నారు.
నిజానికి, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పురందేశ్వరి ఇవే విమర్శలు చాలాసార్లు చేశారు. కేంద్రానికి రాష్ట్రం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని ఆమె విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో… రాష్ట్రంలో మిత్రపక్ష నేతలుగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, పురందేశ్వరి చేసే విమర్శలపై టీడీపీ పెద్దగా స్పందించిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా టీడీపికి మాత్రమే రాజకీయ లబ్ధి చేకూరేట్టుగా మొదట్నుంచీ చంద్రబాబు జాగ్రత్తపడుతూ వస్తున్న తీరుపై కూడా కొన్ని విమర్శలు ఉన్నమాట వాస్తవమే. కానీ, ఈ మధ్య భాజపా కూడా ప్రాజెక్టు నిర్మాణం ఘనత తమదే అని చెప్పుకునేందుకు వీలుగా వ్యవహరిస్తోంది కదా! ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గట్కరీ చెప్పింది కూడా అదే! పోలవరం నిర్మాణం చంద్రబాబుకు ఎంత పట్టుదలతో ఉన్నారో, తనదీ అదే స్థాయి పట్టుదల అని చెప్పారు కదా! అయినాసరే, పురందేశ్వరి ఇంకా ఇలానే విమర్శలు చేయడం విశేషమే.