ముఖ్యమంత్రి లడ్డూ కల్తీ గురించి ఎలా ప్రకటిస్తారు అని.. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై భిన్నమైన చర్చ జరుగుతోంది. న్యాయమూర్తి వ్యాఖ్యలపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం భిన్నంగా స్పందించారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి. తనకు అందిన వివరాలను బట్టి మాట్లాడారు. అలా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టులో న్యాయమూర్తి అడగడం.. ఏ విధంగా సబబని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అందరూ ఆలోచించాలన్నారు.
నిజానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తి వాదనల సందర్భంగా చేసిన కామెంట్లపై న్యాయనిపుణుల్లో విస్మయం వ్యక్తమయింది. అసలు వాదనలు పూర్తిగా ప్రారంభం కాక ముందే లడ్డూ కల్తీ అయిందనడానికి ఆధారాల్లేవని ఆయన వ్యాఖ్యానించడమే కాదు ముఖ్యమంత్రి పేరును నేరుగా ప్రస్తావించి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. అయితే న్యాయవ్యవస్థ విషయంలో ఎవరూ కామెంట్స్ చేయవద్దని చెప్పడంతో అభిప్రాయాలు చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ పురందేశ్వరి మాత్రం కామెంట్ చేశారు.
సహజంగానే జడ్జి వ్యాఖ్యలు వైసీపీకి అమిత ఆనందాన్ని కలిగించాయి. దర్యాప్తులో ఏమి బయటపడుతుందో వారు ముందే చెబుతున్నారు అంటే ఏం జరిగిందో వారికి తెలుసు. అందుకే న్యాయమూర్తి వ్యాఖ్యలను తప్పు పడుతున్న పురందేశ్వరిపై మండిపడుతున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారని అంటున్నారు. వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు కోర్టుల్ని.. న్యాయమూర్తిని చంపేస్తామని పోస్టులు పెట్టించినా.. సొంత నేతలతో తిట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు పురందేశ్వరికి నీతులు చెప్పే ప్రయత్నం చేయడం ఆశ్చర్యకరమే.