భాజపా నేత పురందేశ్వరి మళ్ళీ తెదేపా నేతల తీరును తప్పు పట్టారు. కేంద్రం నుంచి చాలా బారీగా నిధులు అందుకొంటున్నా కూడా తెదేపా నేతలు కేంద్రం సహాయం చేయడం లేదని విమర్శలు, ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఈ రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రాజెక్టుల కోసం సుమారు రూ.1.43 లక్షల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని, ఒకవేళ ఆ లెక్కలు తప్పనుకొంటే, రాష్ట్ర ప్రభుత్వమే ఇంతవరకు కేంద్రం నుంచి ఎంత సహాయం అందిందో, దానిని ఎక్కడ ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు బయటపెట్టాలని కోరారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి వేరే అవసరాలకు వాడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ లెక్కలు అప్పజెప్పిన తరువాత మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం ఏమేమి చేస్తోందో రాష్ట్ర భాజపా నేతలు, కార్యకర్తలే ప్రజల వద్దకు వెళ్లి వివరించడానికి కార్యాచరణ చేసుకొంతున్నామని చెప్పారు. తెదేపా నేతలు తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా కూర్చోబోమని వాటిని బలంగా త్రిప్పి కొడతామని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో తెదేపాతో కలిసి పోటీ చేస్తామో లేదో చెప్పలేమని అన్నారు. రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవడానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉన్న సమస్యలు, అవరోధాలను వివరించి, దానికి బదులుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అందుకోసం రాష్ట్ర భాజపా నేతలు అందరూ తమ అధిష్టానంతో మాట్లాడి దాని సహకారంతో రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ వచ్చేలా, పూర్తయ్యేలా చేస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. కేంద్రం ఇంత ఉదారంగా రాష్ట్రానికి సహాయం చేస్తున్నప్పుడు దానిని అందిపుచ్చుకొని వేగంగా రాష్ట్రాభివృద్ది చేసుకోవాలి కానీ ఇలాగ కేంద్రంపై విమర్శలు, ఆరోపణలు చేయడం తగదని తెదేపా నేతలకు పురందేశ్వరి హితవు పలికారు.
తెదేపా నేతలు కేంద్రంపై విమర్శలు, ఆరోపణలు ఆపరు.. అలాగే పురందేశ్వరి వంటి భాజపా నేతలు తెదేపాకి ఘాటుగా జవాబులు చెప్పకుండా ఊరుకోరు. అయినా ఆ రెండు పార్టీలు నేటికీ కలిసే కొనసాగుతుండటం విశేషం. భాజపా కోరితే నిర్మలా సీతారామన్ కే మళ్ళీ రాజ్యసభ సీటు కేటాయిస్తామన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం గమనిస్తే, రాష్ట్ర స్థాయిలో ఆ రెండు పార్టీల మద్య యుద్ధం జరుగుతున్నప్పటికీ కేంద్రంలో మాత్రం వాటి మధ్య ఇంకా మంచి బంధమే ఉందని అర్ధం అవుతోంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఖరాఖండిగా చెప్పిన తరువాతే చంద్రబాబు నాయుడు భాజపాకి రాజ్యసభ సీటు కేటాయించడం గురించి ఆవిధంగా మాట్లాడారు. కనుక రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల నేతల మద్య జరుగుతున్న యుద్ధాలు భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నవేనని భావించవచ్చు.