ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో మద్యం స్కాంను సీబీఐకి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. గురువారం రాత్రి చంద్రబాబును కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గడిచిన ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు. పురందేశ్వరి ప్రత్యేకంగా లిక్కర్ స్కామ్‌పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ప్రతి రోజూ గుర్తు చేస్తున్నారు. శనివారం కూడా మరోసారి రిమైండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం చేశారు. తనతో పాటు చాలా రికార్డుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన దొరికిపోయారు. ఆయనపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదయింది. ఆయన కేవలం సంతకాలకే పరిమితమని.. కొంత కమిషన్ ఇచ్చి మిగతా అంతా నాటి ప్రభుత్వ పెద్దలే తీసుకునేవారని సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయని.. నేరుగా జగన్ మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ కూడా ఇక్కడ లిక్కర్ సప్లయ్ చేసిన కంపెనీల్లో ఉంది.
ఏపీలో దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసుపై దర్యాప్తు చేస్తే.. అది కక్షసాధింపుగా ప్రచారం చేస్తారు. కానీ సీఐడీ విచారణలో వాసుదేవరెడ్డి వద్ద దొరికిన సాక్ష్యాలకు.. తమ వద్ద ఉన్న సాక్ష్యాలతో సీబీఐ విచారణచేయిస్తే.. అసలు కింగ్ పిన్ దొరికిపోతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాము కక్షసాధింపులకు పాల్పడ్డారనే అపవాదు రాకుండానేరుగా సీబీఐ విచారణకు సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నేతలు కూడా ఇదే స్కాంలో విచారణ కోసం పట్టుబడుతూండటంతో.. చంద్రబాబు కూడా సీబీఐకి అప్పగించేందుకుఅంగీకరిస్తారని భావిస్తున్నారు.