ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో పని చేస్తున్న ఉద్యోగులను ఈ నెల 27లోగా విజయవాడ తరలిరావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల తరలింపు వ్యవహారంపై గత ఏడాదిన్నరగా ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలపై చాలా లోతుగా చర్చలు జరిగాయి. అటు ఉద్యోగులకి, ప్రభుత్వానికి వీలైనంత తక్కువ ఇబ్బందితో ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ఉద్యోగులు కోరిన అనేక కోర్కెలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వాటితో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం కాకపోయినా కొంత ఉపశమనం కలిగిస్తాయి. వారానికి ఐదు రోజులపని వంటి నిర్ణయాలు ఆ కోవలోకే వస్తాయి. అయినా ఉద్యోగులకు అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు విజయవాడ తరలిరాక తప్పనిసరి పరిస్థితి కూడా ఉంది. కనుక ఎన్ని ఇబ్బందులున్నా తరలిరాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
జూన్ 27 నుండి నూతన తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. అందుకే సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఇటువంటి కీలక సమయంలో భాజపా మహిళా నేత పురందేశ్వరి జోక్యం చేసుకోవడానికి సిద్దపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సచివాలయ ఉద్యోగులు ఆమెను కలిసి తమ సమస్యలను మోరపెట్టుకొన్నారు. ముఖ్యంగా భార్యాభర్తలలో ఒకరు కేంద్రప్రభుత్వ ఉద్యోగులైన వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వలన తమకి చాలా సమస్యలు ఎదురవుతాయని కనుక, ఈ విషయంలో సహాయం చేయవలసిందిగా కోరగా, అందుకు ఆమె అంగీకరించి ఈ సమస్య గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచే ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ఇటువంటి సమస్యలు తలెత్తేవే కావని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పరం సహకరించుకొంటూ కలిసిపని చేయాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచే తాత్కాలిక సచివాలయం నుంచి పనిచేయడం మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నప్పుడు, పురందేశ్వరి నిజంగానే జోక్యం చేసుకొంటే సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా జటిలమయ్యే అవకాశాలే ఎక్కువ. పైగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తుంటారు కనుక ఆమె జోక్యం చేసుకొన్నట్లయితే ఈ వ్యవహారంపై మళ్ళీ రెండు పార్టీల మధ్య చిచ్చు రాగలడం ఖాయం.
అయితే ఉద్యోగులను ఎప్పటికైనా విజయవాడ తరలించాలని ముందే తెలిసిఉన్నప్పుడు పురందేశ్వరి చెపుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నలోపం కూడా లేదు. కానీ చాలా గందరగోళ నిర్ణయాలు తీసుకొంది. అందుకే ఉద్యోగులు విజయవాడ తరలిరావడానికి వెనుకాడుతున్నారు. ఇప్పుడు మద్యలో పురందేశ్వరి జోక్యం చేసుకొంటున్నారు. చివరికి ఇది ఏ విపరీత పరిణామాలకి దారి తీస్తుందో ఏమో?