గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నేతలను కూడా తీసుకువచ్చి ప్రచారం చేయిస్తున్నాయి. బీజేపీ తరపున ఇప్పటికే నటి జీవిత ప్రచారం ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం నుండి డి.పురందేశ్వరి కూడా ప్రచారం చేయబోతున్నారు. నటి జీవిత తన ప్రచారంలో తెరాసపై నిశితంగా విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.
కేంద్రప్రభుత్వం అన్ని విధాలా చాలా సహాయం చేస్తునందునే తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయగలుగుతోందని ఆమె అన్నారు. కేంద్రం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మంచి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి పూర్తి చేయగలదా? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి పేర్కొనకుండా తెలంగాణా రాష్ట్రాన్ని కేవలం తమ ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లుగా తెరాస నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారని ఆమె విమర్శించారు.
నేటి నుంచి ప్రచారం చేయబోయే పురందేశ్వరి కూడా బహుశః అదే విధంగా చెప్పవచ్చును. అదే నిజం కూడా. కానీ బీజేపీ నేతల నిరాసక్తత లేదా అశ్రద్ధ కారణంగా కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకి ఇంత వరకు ఎంత మొత్తం విడుదల చేసింది. ఏ ఏ ప్రాజెక్టులకు, అభివృద్ధి, సంక్షేమ పధకాలకు అనుమతులు, నిధులు మంజూరు చేసింది? ఇంకా మున్ముందు ఏమేమీ చేయబోతోంది? వంటి వివరాలను ఎప్పటికప్పుడు గట్టిగా చెప్పుకోకపోవడం చేతనే, ఆ క్రెడిట్ ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాలో రాసేసుకొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోను బీజేపీ నేతల పరిస్థితి ఇదే. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు తడబడుతుంటారు. కనీసం ఇప్పటికయినా వారు మేల్కనకపోయినట్లయితే చివరికి వారే నష్టపోవచ్చును.