బిజెపి సీనియర్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలకు ఎప్పుడూ రెండువైపులా పదును ఉంటుంది. ఏ.పీ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిక్కుల్లో పడితే ఆదుకోవడం ఆయన ప్రథమ కర్తవ్యం. అదే సమయంలో తన పెద్దరికాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయాస పడుతుంటారు. చంద్రబాబు మంత్రివర్గంలోకి వైసీపీ ఫిరాయింపుదారులను చేర్చుకోవడంపై వివాదం రాజుకుంటూనే ఉంది. దీనిపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష నేత జగన్ కేంద్రంలోనూ అన్ని పార్టీల నేతలను కలుసుకుంటానని ప్రకటించారు. ఆ రీత్యా ఇది జాతీయ చర్చ అవడం అనివార్యం. దానివల్ల మంత్రుల కొనసాగింపుపై ప్రభావం లేకున్నా, రాజకీయ ఇరకాటం మాత్రం తప్పదు. ఈ పరిస్థితిలో వెంకయ్యనాయుడు ఫిరాయింపులను సూటిగా సమర్థించలేక, చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ విమర్శలతో గొంతు కలపలేక సతమతమవుతున్నారు. ఒక పార్టీపై గెలిచి, మరో ప్రభుత్వంలో చేరటం సరికాదంటూనే ఒక నాయకుడి కోసం చట్టాలను మారుస్తామా? అంటూ రెండో రాగం కూడా వినిపిస్తున్నారు. నిజానికి ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా వంటి చోట్ల బిజెపి నిర్వాకాలు చూసినవారు వెంకయ్య నుంచి ఇంతకంటే భిన్నమైన స్పందన ఆశించరు.
అయితే, వ్యక్తిగతంగా చంద్రబాబును ఎప్పుడూ వ్యతిరేకించే మరో బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. చట్టం చేస్తామా? అని వెంకయ్య ప్రశ్నిస్తుంటే, చట్టం చేయాలి… అంటూ ఆమె కేంద్రానికి లేఖ రాశారు. చాలా విషయాల్లో పురంధేశ్వరీ, సోము వీర్రాజు వంటివారు టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేయటం జరుగుతూనే ఉంది. అయితే ఈ క్లిష్ట సమస్యలోనూ చిన్నమ్మ లేఖ రాశారంటే దాన్ని కేవలం వ్యక్తిగత చర్యగా చూడటానికి లేదు. ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలను ఒక వర్గం బిజెపి నేతల వ్యతిరేకతను తెలిపే పరిణామంగా దీన్ని చూడవలసిందే. పైగా తెలంగాణలో టిడిపితో వెళ్లబోమని వెంకయ్యే స్వయంగా చెప్పారు కనుక ఆంధ్రప్రదేశ్లోనూ ఆ పార్టీ వ్యతిరేకులకు కొంతైనా కొమ్ములు వస్తాయి కదా!