కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తును.. ఎన్టీఆర్ కుమార్తె హోదాలో… వ్యతిరేకిస్తానని.. దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. అంతే కాదు.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎలా స్పందిస్తారో చూడాలని కూడా.. ఆసక్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీపై అంత వ్యతిరేకత చూపించడంలో అర్థం ఉంది కానీ… తెలుగుదేశం పార్టీ విధాన పరంగా.. కుటుంబసభ్యులను కూడా… తీసుకు రావడమే కాదు.. ఏకంగా .. తాను ఎన్టీఆర్ కుమార్తెగా వ్యతిరేకిస్తానని ప్రకటించి… అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు. ఎవరు ఔనన్నా.. కాదన్న అది నిజం. అందుకే దగ్గుబాటి పురందేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తానని ప్రకటించారు.
కానీ అదే కాంగ్రెస్‌లో .. ఆమె ఎన్టీఆర్ కుమార్తె అనే ట్యాగ్‌లైన్‌తో చేరారు. ఆదే పలుకుబడితో ఎంపీ సీటు తెచ్చుకున్నారు. అదే పలుకుబడితో… పార్టీలకు అతీతంగా మద్దతు పొంది రెండు సార్లు గెలుపొందారు. కేవలం ఎన్టీఆర్ కుమార్తె.. అన్న కారణంగానే.. ఆమెకు మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే.. ఎన్టీఆర్ తన జీవితాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో చేరి.. పదేళ్ల పాటు పదవులు అనుభవించినప్పుడు… దగ్గుబాటి పురందేశ్వరికి.. కాంగ్రెస్ వ్యతిరేకత గుర్తుకు రాలేదా..?. అప్పుడు.. తన తండ్రి సిద్ధాంతాలు గుర్తుకు రాలేదా..? ఏపీలో ఇక కాంగ్రెస్ పార్టీతో ఉంటే.. రాజకీయ భవిష్యత్ ఉండదని… ఎన్నికలకు ముందే బీజేపీలో చేరడం… మర్చిపోయారా..?
ఎన్టీఆర్ కుమార్తెగా ఏ పార్టీలో ఉన్నా.. నందమూరి అభిమానులు ఆమెను ఆదరిస్తూనే ఉన్నారు. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీని అడ్డగోలుగా సమర్థించేందుకు విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. ఇదే నందమూరి అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఎన్టీఆర్ లా… పురందేశ్వరి కూడా… కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదటి నుంచి చూపిస్తూ ఉంటే.. ఆమె మాటలకు వాల్యూ ఉండేది. కానీ ఏ కాంగ్రెస్ పార్టీని అయితే బూచిగా చూపేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారో.. అదే కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల పాటు… అధికారం అనుభవించి .. ఇప్పుడు.. అదేమీ గుర్తు లేనట్లు విమర్శలు చేస్తున్నారు. టీడీపీపై ఎంతో అభిమానం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆమె ఇంటెన్షన్ మాత్రం… టీడీపీ ఏమైనా పర్వాలేదనే… ! రాజకీయాలు అంటే అంతే మరి..!