తెదేపా, భాజపాలు ఇక నేడోరేపో తెగతెంపులు చేసుకొంటాయా..అనే పరిస్థితిలో భాజపా అభ్యర్ధి సురేష్ ప్రభుకి తెదేపా రాజ్యసభ సీటు కేటాయించడంతో మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చినట్లు కనబడుతున్నాయి. కానీ పురందేశ్వరి వంటి భాజపా నేతలు మాత్రం తమ నోటికి ఇంకా పని చెపుతూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభ్యర్ధన మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి రాజ్యసభ సీటు కేటాయించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాకి చెపుతుండటాన్ని పురందేశ్వరి అభ్యంతరం చెప్పారు. భాజపా అభ్యర్ధికి సీటు కేటాయించాలని వారు కోరారా లేకపోతే తెదేపాయే స్వయంగా భాజపాకి సీటు ఆఫర్ చేసిందో తెలుసుకొని నారా లోకేష్ మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు. తెదేపాని సీటు ఇమ్మని భాజపా కోరలేదని ఆమె అన్నారు.
ఆమె చెప్పినట్లు తెదేపాయే స్వయంగా భాజపాకి సీటు ఆఫర్ చేసి ఉన్నా, లేదా లోకేష్ చెపుతున్నట్లుగా భాజపాయే సీటు ఇమ్మని కోరినా మొత్తానికి జరిగింది ఒక్కటే. ఒకవేళ ఆమె చెపుతున్నట్లుగా సీటు కోసం భాజపా అడగకపోయినా తెదేపా ఇచ్చుంటే అది తెదేపా మంచితనమే అవుతుంది తప్ప అందులో భాజపా గొప్పేమీ లేదు. ఒకవేళ లోకేష్ చెపుతున్నట్లుగానే ప్రధాని మోడీ, అమిత్ షా సీటు కోసం చంద్రబాబు నాయుడుని అడిగి ఉండిఉంటే, వారి మాటని గౌరవించి సురేష్ ప్రభుకి సీటు కేటాయించడం కూడా తెదేపా ఔనత్యాన్ని చాటుతోంది. కనుక ఎవరు సీటు అడిగారని వాదోపవాదాలు చేయడం కంటే, రాష్ట్రంలో భాజపాపట్ల ప్రజలలో వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను కాదని భాజపాకి సీటు కేటాయించినందుకు, పురందేశ్వరి తెదేపా పట్ల కృతజ్ఞతాపూర్వకంగా రెండు మంచి ముక్కలు మాట్లాడితే బాగుండేది. మిత్రపక్షమైన తెదేపా ప్రతాపం చూపే బదులు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం సురేష్ ప్రభుపై ఒత్తిడి చేస్తే బాగుంటుంది.