కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె…సుహాసిని బరిలో ఉంటుందని క్లారిటీ వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ మద్దతు పలికారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి నామినేషన్ వేయించారు. పార్టీ నేతలకు.. ఎప్పుడేం చేయాలో చంద్రబాబు సూచనలు ఇస్తున్నారు. ప్రచార హోరు పెరుగుతున్న కొద్దీ.. ఒక్కొక్కరిగా.. కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సహా అందరూ ప్రచారంలోకి వస్తున్నారు. అదే సమయంలో.. నందమూరి సుహాసిని… నియోజకవర్గం మొత్తాన్ని పాదయాత్ర ద్వారా చుట్టేస్తున్నారు. మరో వైపు అమరావతి నుంచే.. చంద్రబాబు కొంత మంది కీలమైన నేతల్ని .. టీడీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గొట్టముక్కల పద్మారావు టీడీపీలో చేరుతున్నారు. ఆయన సుహాసినికి మద్దతుగా ప్రచారం ప్రారంభిచారు. ఇలా కుటుంబసభ్యులంతా.. సుహాసిని కోసం ప్రయత్నాలు చేస్తూండగా… ఆమె అత్త దగ్గబాటి పురంధేశ్వరి మాత్రం… సుహాసినిని ఓడించాలంటూ.. కూకట్పల్లిలో ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న మాధవరం కాంతారావు అనే అభ్యర్థి కోసం.. ఆమె రోడ్ షో నిర్వహించారు. వసంతనగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని టీఆర్ఎస్తో పాటు.. మహాకూటమిపైనా విమర్శలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. పదేళ్లు మంత్రిగా ఉండి..ఆ తర్వాత వెంటనే బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తే.. లేని తప్పు.. కాంగ్రెస్- టీడీపీల పొత్తుతో ఎలా వచ్చిందో కానీ.. పురంధేశ్వరి .. బీజేపీ తరపున ప్రచారాన్ని మాత్రం.. నందమూరి అభిమానులు ఊహించలేకపోయారు.
ఇప్పటి వరకూ.. ఆమె ఏ పార్టీలో ఉన్నా.. ఎన్టీఆర్ బిడ్డ అన్న కారణంతో ఆదరించిన.. నందమూరి అభిమానులు ఇక నుంచి .. అలాంటి రజర్వేషన్లు పెట్టుకోరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూకట్పల్లి బీజేపీకి డిపాజిట్ రాదు. కానీ.. ఓ పది వేల ఓట్లు చీల్చగలరు. అంత మాత్రం దానికే ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది చాలా మందికి అర్థం కాలేదు.