కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కీలకమయిన మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా ఒక వెలుగు వెలిగిన పురందేశ్వరి సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ ఓటమి, మోడీ ప్రభావం వలన బీజేపీ గెలుపు తధ్యం అని ఆమె వేసిన అంచనా నిజమయింది. కానీ బీజేపీలో చేరితే మళ్ళీ తన స్థాయిని నిలబెట్టుకోవచ్చనే ఆమె అంచనా తప్పింది. తప్పింది అనే కంటే తప్పించబడిందని చెప్పుకోవలసి ఉంటుంది. విశాఖ సిట్టింగ్ ఎంపీ అయిన ఆమె అక్కడి నుండే పోటీ చేయాలనుకొన్నారు. దాని కోసం ఆమె తమ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డితో చాలా పోరాటం చేసారు. ఒకవేళ అక్కడి నుండే ఆమె పోటీ చేసి ఉండి ఉంటే తప్పక విజయం సాధించేవారని ఖచ్చితంగా చెప్పవచ్చును. కానీ ఆమెను తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడంతో అసలు ఆమెకు ఎటువంటి పరిచయం, బలము లేని రాజంపేట నియోజక వర్గం నుండి అయిష్టంగానే పోటీ చేసి ఊహించినట్లుగానే ఓడిపోయారు. ఆ కారణంగా మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పాలనే ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
కానీ ఆలశ్యంగానయినా ఆమె ప్రతిభను, రాజకీయ అనుభవాన్ని బీజేపీ అధిష్టానం గుర్తించి ఆమెను బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్-చార్జ్ గా నియమించి గౌరవించింది. ఆమె శుక్ర, శనివారాల్లో చిత్తూరు జిల్లాలో రాజంపేట, చిత్తూరు, పుంగనూరు, పలమనేరు పార్లమెంటు నియోజకవర్గాలలో పర్యటించబోతున్నారు. బీజేపీని ప్రజలకు దగ్గర చేసేందుకు ఆ పార్టీ అమలుచేస్తున్న మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఆమె తన రెండు రోజుల పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి వారికి కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పధకాలపై అవగాహన కల్పిస్తారు. తద్వారా బీజేపీపై రాష్ట్ర ప్రజలలో నెలకొన్న అపోహలు దూరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిలదీస్తుంటే వాటికి జవాబు చెప్పలేక బీజేపీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో ఆమె తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు వివరించవచ్చును.