హైదరాబాద్: వేసవి కాలంలోకూడా నిరంతరంగా కరెంట్ ఇచ్చి ప్రశంసలు అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదే విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంనుంచి 1,000 మెగావాట్లకోసం తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) అత్యంత లోపభూయిష్టంగా ఉందని బయటపడింది. టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకున్న వైనం తాజాగా వెలుగుచూసింది. యూనిట్‌కు రు.4 చొప్పున విక్రయించేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తుండగా, రెండున్నర ఏళ్ళ తర్వాత రాష్ట్రానికి అందే కరెంట్ కోసం ప్రభుత్వం టెండర్లు లేకుండానే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది(ఇరు రాష్ట్రాలమధ్య విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తి కావటానికి రెండున్నర ఏళ్ళు పట్టనుంది). ఈ పీపీఏ ద్వారా అక్కడి విద్యుత్ రాష్ట్రానికి చేరేసరికి యూనిట్‌కు రు.5 నుంచి రు.5.70 వ్యయం అవనుంది.
మొత్తంమీద చూస్తే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారబోతోంది. విద్యుత్ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏటా రు.800 కోట్ల అదనపు భారం పడనుంది. 12 ఏళ్ళ ఒప్పంద కాలానికి దాదాపు రు.10 వేల కోట్లవరకు ఛార్జీల మోత మోగబోతోంది. ఏ ధరకు విద్యుత్ లభిస్తుందో తేల్చుకోకుండా దేశంలో జరిగిన తొలి విద్యుత్ ఒప్పందం ఇదే అంటున్నారు. ఉత్తరాదిన పుష్కలంగా మిగులు విద్యుత్ ఉండి కొనుగోలు చేసేవారేలేక ఎన్నో ప్లాంట్లు మూతబడుతున్న పరిస్థితుల్లో ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయటం వెనక భారీగా ముడుపులు చేతులు మారి ఉంటాయని అంటున్నారు.
మరోవైపు, 2018 నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తిని 24,075 మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వమే చెప్పుకున్న నేపథ్యంలో, రెండేళ్ళ తర్వాత వచ్చే ఈ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఎందుకంటూ తలెత్తుతున్న ప్రశ్నకు సమాధానం దొరకటంలేదు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై విచారణకోసం తెలంగాణ ఈఆర్సీ తాజాగా పీపీఏ ఒప్పందం డాక్యుమెంట్‌ను వెబ్సైట్లో ఉంచటంతో ఈ లొసుగులన్నీ వెలుగు చూశాయి.