పూరి ఎప్పుడూ యమ ఫాస్టే. లైగర్ తరవాత పూరి చాలా బ్రేక్ తీసుకొన్నాడు. అయితే సినిమా మొదలెట్టిన తరవాత.. ఎప్పటిలానే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఇప్పుడు ముంబైలో శరవేగంగా సాగిపోతోంది. ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ని రూపొందిస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు ముంబైలోనే ఈ ఫైట్ తెరకెక్కిస్తారు. మరోవైపు కథానాయిక, సంగీత దర్శకుడు, విలన్ ల కోసం అన్వేషణ సాగుతోంది. నలుగురు స్టార్ హీరోయిన్ల పేర్లు ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలనలో ఉన్నాయి. వాళ్లలో ఒకర్ని ఈ నెలాఖరులోగా ఫైనల్ చేస్తారు. ఇస్మార్ట్ శంకర్ కోసం మణిశర్మ సంగీతం అందించాడు. ఆ సినిమాలోని పాటలన్నీ హిట్టే. సినిమా విజయానికి పాటలు దోహదం చేశాయి. అయితే ఇప్పుడు మణిశర్మ స్థానంలో కొత్త సంగీత దర్శకుడ్ని తీసుకోవాలన్నది పూరి నిర్ణయం. విలన్ విషయానికొస్తే.. ఈసారి బాలీవుడ్ విలన్ పక్కా. ఇప్పటికే ఒకరిద్దరితో పూరి సంప్రదింపులు మొదలెట్టాడు. పూరికి బాలీవుడ్ బ్యాచ్‌తో మంచి అనుబంధం ఉంది. ఎవరిని అడిగినా, కాదనరు. అందుకే విలన్ విషయంలో పెద్దగా టెన్షన్ లేదు. ఈ యేడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి, 2024 ఫిబ్రవరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలన్నది పూరి ప్లాన్.