పాడ్ కాస్ట్ పేరుతో పూరి జగన్నాథ్.. తన భావాల్ని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నాడు. అవన్నీ పూరి సినిమాల్లో ని డైలాగుల్లా బాగా పేలుతున్నాయి. వాటిలో పూరియిజం అనేది ఇంకాస్త స్పష్టంగా వ్యక్తం అవుతోంది. పూరికి ఎందుకంత అభిమానులున్నారో… ఈ మాటలు వింటే అర్థమవుతుంది. అయితే.. పాడ్ కాస్ట్లోనూ అప్పుడప్పుడూ పూరి కాస్త కంట్రోల్ తప్పుతున్నాడనిపిస్తోంది. పూరి మాటలు ఓ వర్గం మనోభావాల్ని నొచ్చుకునేలా చేస్తున్నాయి..
ఆమధ్య పేదరికం గురించి చాలా బాగా మాట్లాడాడు పూరి. పేదలుగా బతక్కండి.. అంటూ పిలుపునిచ్చాడు. పూరి మాటలు స్ఫూర్తి నింపేవే. కానీ.. ఓ చోట మాత్రం `రేషన్ కార్డులున్నవాళ్లందరికీ ఓటు హక్కు తీసేయండి` అన్నాడు. ఇవన్నీ ఓ వర్గాన్ని బాధించే మాటలే. రేషన్ కార్డు ఉన్నంత మాత్రన ఓటు హక్కు ఉండదా? అంటే డబ్బున్న వాళ్లే ఓటు వేయాలా? అంటూ పూరిని ఓ వర్గం విమర్శిస్తోంది.
ఇప్పుడు `పెళ్లయిన ఆడవాళ్లందరీ ఓ విన్నపం` అంటూ మరోటి వదిలాడు. మొగుడు ఎంత ఏడిస్తే.. అంత ఏడవండి.. అన్నట్టు సాగింది పూరీ బాతాఖానీ. ఇవన్నీ వినడానికి సరదాగా ఉన్నా.. ఆలోచిస్తే.. `ఆడాళ్లూ. మీ ఖర్మ ఇంతే` అన్న అర్థం ధ్వనిస్తోంది. లైట్ గా తీసుకున్నవాళ్లూ, నిజానిజాలు ఆలోచించేవాళ్లూ..పూరి మాటలు ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంత మంది పెడార్థాలు తీస్తూ – ఫీలవుతున్నారు.
“అందరి పెళ్లాలకంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్లమే.
ప్రతీ దేవుడూ వాళ్ల భార్యని ఏడిపించినవాళ్లే“ అంటూ ఈ టాపిక్లోని దేవుడినీ లాగేశాడు పూరి. అవన్నీ నిజాలు కాకుండా పోవు. కానీ.. ఇంతటి సెన్సిటివ్ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కదా. పూరి కాస్త కంట్రోల్ లో ఉండి మాట్లాడితే బాగుండేది. పూరి ఎప్పుడూ అంతే. సూటిగా మాట్లాడేస్తాడు. అదే అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇప్పుడు అదే తలనొప్పుల్నీ తీసుకొస్తోంది. ఇక ముందైనా పూరి కాస్త కంట్రోల్ లో ఉంటాడేమో చూడాలి.