ఓ సినిమాని మొదలెట్టడంలో కాదు, పూర్తి చేయడంలోనే అసలైన సామర్థ్యం ఉంటుంది. వేగంగా సినిమా పూర్తి చేయడం, సరైన టైమ్ లో సినిమాని విడుదల చేయడం కత్తిమీద సామే. ఈ విషయంలో పూరి జగన్నాథ్‌కి తిరుగే లేదు. ఇప్పుడున్న దర్శకులెవరైనా తీసుకోండి. స్పీడులో పూరి తరవాతే ఎవరైనా. సినిమా మొదలెట్టడమే ఆలస్యం… చక చక పూర్తయిపోతుంది. కథ కోసం యేళ్ల తరబడి రిసెర్చ్ చేయడం, రీషూట్లు చేయడం, తీసిందే తీయడం.. ఇవేం పూరి పోగ్రెస్ రికార్డులోనే లేని విషయాలు. అందుకే పూరిని చూసి రాజమౌళి లాంటి వాళ్లే ఆశ్చర్యపోతారు. వేగంగా సినిమా ఎలా తీయాలో, ఆయన్ని చూసి నేర్చుకోవాలి… అని ఓ సందర్భంలో సభాముఖంగానే చెప్పేశాడు రాజమౌళి. అదీ పూరి అంటే.
విజయ్ దేవరకొండతో `లైగర్` సినిమా తీస్తున్నాడు పూరి. అది పాన్ ఇండియా సినిమా. రిలీజ్‌కి ఇంకా టైముంది. ఈలోగా మరో పాన్ ఇండియా సినిమా ప్రకటించేశాడు. అంతేనా? రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు. 2023 ఆగస్టు 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని కొబ్బరి కాయ కొట్టేటప్పుడే ఫిక్స్ చేసేశాడు. సినిమా మొదలెట్టిన రోజే, రిలీజ్ డేట్ చెప్పేయడం పూరి స్టైల్. ఈసారీ అదే జరిగింది. కాకపోతే… సినిమా మేకింగ్‌లో చాలా మార్పులొస్తున్నాయి. కాల్షీట్ల సమస్య.. ఉండనే ఉంది. పాన్ ఇండియా సినిమా అంటే.. స్టార్లతో వ్యవహారం. అయినప్పటికీ.. రిలీజ్ డేట్ చెప్పేసి తొడగొట్టాడంటే.. మామూలు విషయం కాదు. ఇది వరకు బాలీవుడ్ లో ఈ ఫార్ములా ఉండేది. వాళ్లు ముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేవాళ్లు. కానీ.. వాళ్లు సైతం.. తమ సినిమాల్ని అనుకొన్న సమయానికి విడుదల చేయడం లేదు. ఈ విషయంలో.. వాళ్లనే దాటేశాడు పూరి. పాన్ ఇండియా పేరు చెప్పి ఏళ్ల తరబడి సినిమాలు తీయడం, హీరోల్ని రెండు మూడేళ్ల పాటు లాక్ చేసేయడం.. ఇలాంటి పరిస్థితుల్లో పూరి ఫటాఫట్ మని సినిమాలు తీయడం.. నిజంగా గొప్ప విషయమే.
ఎన్నేళ్లు సినిమా తీశామన్నది కాదన్నయ్యా.. హిట్టయ్యిందా లేదా? – పోకిరి డైలాగ్‌ని పూరి విషయంలో ఇలా మార్చుకొని రాసుకోవాలేమో?