చిరుతో ఓ సినిమా తీయాలన్నది పూరి కల. `ఆటోవాలా` అనే సబ్జెక్ట్ ని రెడీ చేసినా అది పట్టాలెక్కలేదు. అయితే చిరుతో పనిచేయాలన్న కోరిక మాత్రం పూరికి తీరబోతోంది. దర్శకుడిగా కాదు. నటుడిగా. చిరుతో కలిసి పూరి ఓ సినిమాలో నటిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..?
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకుడు. మలయళంలో సూపర్ హిట్ అయిన `లూసీఫర్`కి ఇది రీమేక్. ఇందులో పూరి అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమా కోసం జర్నలిస్టు అవతారం ఎత్తారు. కథలో చాలా కీలకమైన చోట.. పూరి ఎంట్రీ ఉండబోతోంది. మలయాళంలో ఈ పాత్రలేదు. తెలుగు మార్పులూ, చేర్పులలో భాగంగా.. ఈ పాత్ర రాబోతోంది. పూరి పలికే డైలాగులు గమ్మత్తుగా ఉంటాయని, పవర్ఫుల్ గా వినిపిస్తాయని, పూరి కనిపించేది కాసేపే అయినా… ఆ సీన్ రక్తి కట్టబోతోందని తెలుస్తోంది. ఈ రోజే పూరి `గాడ్ ఫాదర్` సెట్లో కూడా అడుగుపెట్టేశారు. పూరిని చిరు ఘనంగా ఆహ్వాచించారు. ఈరోజుతో పూరి సీన్ పూర్తయిపోతుంది కూడా. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయిక. యువ కథానాయకుడు సత్యదేవ్ కూడా.. ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.