సినిమాలపై పూరికి ఎంత ప్రేమ ఉందో.. `నేనింతే`లో చూపించేశాడు. సినిమా ఆడిందని ఆపేస్తామా? పోయిందని మానేస్తామా? సినిమాలు తీస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసింది సినిమా.. సినిమా.. సినిమా అంటూ – సినీ రంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరి గుండె ఘోష వినిపించాడు పూరి. అయితే పూరి మాటలకే పరిమితం అవ్వలేదు. సినిమాపై తనకున్న ఇష్టాన్ని చేతల్లోనూ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇటీవల `ఇస్మార్ట్ శంకర్`తో ఓ సూపర్ హిట్టు కొట్టిన పూరి – నిర్మాతగానూ లాభాల్ని ఆర్జించాడు. ఇప్పుడు ఆ లాభాల్లో కొంత మళ్లీ సినిమా రంగానికే ఇవ్వబోతున్నాడు.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, సినిమాలే ప్రపంచం అని బతికి, ఇప్పుడు చితికిపోయిన కొంతమంది దర్శకుల్నీ, సహాయ దర్శకుల్నీ గుర్తించాడు పూరి. వాళ్లకు తనవంతు సహాయం అందించడానికి సిద్ధమయ్యాడు. 20మందికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చాడు. ఇదేం పెద్ద సహాయం కాదు, చిన్న చిరునవ్వులాంటి పలకరింపు – స్వీకరించండి అంటూ సహాయం అందుకోబోతున్నవాళ్లకు ఓ లేఖ కూడా రాశాడు.
”మా ఈ చిన్న సహాయం మీకు ఏమాత్రం ఊరటనిచ్చినా చాలు. అది మా ప్రయాణానికి ఆశీస్సులుగా భావిస్తాం. మేము బతికి ఉన్నంత కాలం దేవుడు మాకీ శక్తి ఇచ్చినట్టైతే, మేము ప్రతి సంవత్సరం ఇలానే ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం” అంటూ పూరి ఓ లేఖలో పేర్కొన్నాడు.