చేతనైనోడు చేతులు కట్టుకొని కూర్చుంటే
చేతకానోడు చిందరబందర చేస్తుంటాడు!
అది సమాజమైనా
సినిమా అయినా.
మాకన్నీ తెలుసని ఏమీ తెలియనివాళ్లకే తెలిసినప్పుడు.. తెలిసినోడు తెలియనట్టు ఉండడం ఎందుకన్నదే పాయింటిక్కడ. కాకపోతే సినిమా ఇండ్రస్ట్రీలో అరకొర బుర్రలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. చేతకానితనంతో చేసిన సినిమాలు పొరపాటున ఆడేస్తే… వాటినే చూస్తూ చూస్తూ భరించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలోనూ ఆ అరాచకత్వం కనిపిస్తుంటుంది. దానికి కొండో కొచో పూరి లాంటి వాళ్లూకారణం అవుతారు.
పూరి ఎన్ని చేశాడు.. మనకెన్నిచ్చాడు?
తెలుగు సినిమా హీరోయిజాన్ని మార్చిన ఘనత పూరికీ దక్కుతుంది. దక్కాలి కూడా.
హీరో అంటే ఇలానే ఉంటాడు… అని వాడి జత్తుకు నూనె రాసి, పక్క పాపిడి దువ్వి, వాడ్ని బలవంతంగా బుద్ది మంతుడ్ని చేసి తెరపైకి పంపించారు దర్శకులు.
హీరో అంటే ఇలాక్కూడా ఉండొచ్చు అని వాడ్ని ఇడియట్‌ని చేసి, పోకిరిగా మార్చి.. చివరికి రోగ్ లా చేసేశాడు పూరి.
నా కూతుర్ని నీకు ఇవ్వను పో అంటే వాడ్ని బతిమాలి బామాలి వాడికి లొంగి, వాడి ముందు ఒంగి.. హీరోయిన్ని ఇంటికి తీసుకొచ్చుకొన్నారు మిగిలిన హీరోలు.
నువ్వు నందా అయితే నేను బద్రిని అంటూ లాక్కుతెచ్చుకొన్నాడు పూరి హీరో
కమీషనర్ కూతుర్లకు మొగుళ్లు రారా అంటూ.. వాడికే మొగుడైపోయాడు పూరి హీరో
నాకంటే ఒక రూపాయి ఎక్కువ సంపాదించు అంటూ మామ విసిరిన టార్గెట్‌ని ఛేదించడానికి చమటోడ్చారు మిగిలిన హీరోలు
నేనున్న రోడ్డు మీదికే నిన్నూ లొక్కొచ్చేస్తా చూడు అంటూ సవాల్ విసిరారు పూరి పోరగాళ్లు.
ఇలాంటి హీరో ఉంటే బాగుణ్ణు అనుకోవడం మానేసి.. అలా నేను కూడా ఉంటే బాగుణ్ణు కదా అనుకొనేలా చేశాడు పూరి.
అక్కడా మాస్ మనసుల్ని మొత్తంగా దోచేశాడు. యేడాదికి ఒకటి, రెండేళ్లకు ఒకటి అంటూ బద్దకంగా ఒళ్లు విరుచుకొంటూ సినిమాలు తీస్తున్న దర్శకుల మధ్య..
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లా దూసుకొచ్చాడు పూరి. ఫట్ మని పాతిక సినిమలు చేసి, యాభై కోసం పరుగులు పెడుతున్నాడు.
పూరి పెన్ను కదం తొక్కినప్పుడల్లా.. థియేటర్లో ఎవ్వరూ సీట్లో కూర్చోలేదు. ఎగిరి గంతులేశారు.
పూరి డైలాగులు చెంప ఛెళ్లు మనిపించిన సందర్భాలూ కోకొల్లలు. బాలయ్య తో కొట్టించుకొంటే ఫ్యాన్స్‌కి ఆనందం అన్నట్టు.. పూరితో తిట్టించుకోవడం కూడా జనాలకు ఆనందమే. అలా… పూరి మనింటి మనిషైపోయాడు.
అలాంటి పూరి ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అనిపిస్తే బోల్డంత బెంగ వచ్చేస్తుంది. సినిమాలు చుట్టేస్తుంటే కోపం వచ్చేస్తుంటుంది. ఆ డైలాగులు చూస్తుంటే పాపం అనిపిస్తోంది.
మాఫియాని పట్టుకొని వదలడం లేదు. ఒక కథే పట్టుకొని గింగిరాలు తిరుగుతున్నాడు. హీరోల ఇమేజ్‌ని మార్చేసిన పూరి.. తానే ఓ ఇమేజ్‌లో కూరుకుపోయాడు. ఈ పూరి మనకొద్దు… పాత పూరినే కావాలి.. అలాంటి పూరి మళ్లీ మనకోసం రావాలి. మరి వస్తాడా?? ఈ రోగ్ల్ని, లోఫర్లనీ వదిలేసి… కొత్త హీరోయిజం చూపిస్తాడా..?
చూపించాలి మరి! దానికి తన కొత్త సినిమా ‘మెహబూబా’తోనే నాంది పలకాలి.
పూరి.. స్పీడందుకో..
పూరి… కొత్త కథలు రాసుకో..
పూరి… ఈ బాక్సాఫీసుని మళ్లీ ఏలుకో..
నీ కోసం ఎదురుచూస్తుంటాం!!
(పూరికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో)