హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాపై దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక్కరోజులోనే మాట మార్చారు. తాను చిరంజీవికి కథను నేరేట్ చేస్తే ఫస్ట్ హాఫ్ నచ్చిందని ఆయన అన్నారని, సెకండ్ హాఫ్ మెరుగుపరచమని అన్నారని పూరి చెప్పారు. అయితే సెకండ్ హాఫ్‌ను తాను తయారు చేసేలోపుగానే ఆ స్టోరీ నచ్చలేదని చిరంజీవి మీడియాతో చెప్పారని, ఆ మాట తనతోనే చెబితే బాగుండేదనికూడా పూరి అన్నారు. పైగా, ఈ ప్రాజెక్ట్ కారణంగా తాను రెండుకోట్ల రూపాయల అడ్వాన్స్‌లు వెనకకు ఇచ్చేశానని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన పూరి, ఏమయిందో ఏమోగానీ ఒక్కరోజులోనే మాట మార్చేశారు. చిరంజీవితో ఎలాగైనా సినిమా చేస్తానని అన్నారు. 150వ సినిమా కాకపోతే 151వ సినిమా అయినా చేస్తానంటూ ఇవాళ ట్వీట్ చేశారు. చిరంజీవి 150వ సినిమా చేయటానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కు ఉందని, ఎందుకంటే తాను ఆయన అభిమానినని పేర్కొన్నారు. తెరమీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయనకన్నా, ఫ్యాన్స్‌కే తెలుసని అన్నారు. ఈ కథ కుదరకపోతే, మరో కథ తయారు చేస్తానని, అదీ నచ్చకపోతే ఆయనకు నచ్చేంతవరకు చేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్నదే తన కోరిక అని అన్నారు.
ఈ ట్వీట్ల వ్యవహారం వెనక చరణ్ ఉన్నాడని తెలిసింది. పూరి మొన్న తన పుట్టినరోజున చిరు 150వ సినిమాపై కామెంట్ చేయగానే, చరణ్ బర్త్‌డే విషెస్ చెప్పటానికి పూరిదగ్గరకు వెళ్ళి ఆయనను శాంతింపజేశాడని సమాచారం. అందుకే పూరి ఇవాళ చిరుపై ప్రేమను రంగరిస్తూ ట్వీట్లు చేశాడని అంటున్నారు.