పూరి జగన్నాథ్ – కల్యాణ్ రామ్ కలయికలో రూపుదిద్దుకొన్న ఇజం.. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఇజం సినిమా బిజినెస్ దాదాపుగా పూర్తయ్యింది. వచ్చిన కాడికి ఈ సినిమాని అమ్ముకొన్నారని, బడ్జెట్‌తో పోలిస్తే… ఈ సినిమాకి వచ్చింది తక్కువే అని టాక్ వినిపిస్తోంది. కల్యాణ్ రామ్ ఆర్థికంగా గట్టెక్కాలంటే.. ‘ఇజం’ శాటిలైట్ కి మంచి రేటు రావాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో శాటిలైట్ పై ఆశలు పెట్టుకోవడం కష్టమే. అయితే పూరిపై నమ్మకంతోనో ఏమో.. జెమినీ వాళ్లు ఈ సినిమాకి రూ.4.5 కోట్లు ఆఫర్ చేశారట. కానీ… పూరి మాత్రం ఈ సినిమాని అమ్మడానికి సముఖత చూపించడం లేదని తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక రూ.6 కోట్ల వరకూ వస్తుందని, అప్పటి వరకూ ఓపిక పట్టాలని పూరి భావిస్తున్నాడట.
ఇజంపై పూరికి ఉన్న నమ్మకం అలాంటిది. ఈ సినిమాకి విడుదలకు ముందు తగిన హైప్ లేకపోయినా… సినిమా బయటకు వచ్చాక ఎక్కువగా మాట్లాడుకొంటారని, తన సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని నమ్ముతున్నాడు పూరి. కల్యాణ్ రామ్ కూడా అదే భరోసాతో శాటిలైట్ హక్కుల్ని అట్టి పెట్టుకొన్నాడని తెలుస్తోంది. శాటిలైట్ హక్కులకూ… పూరి పారితోషికానికీ లింకు ఉంది. శాటిలైట్‌కి ఎంతొస్తే అంత పూరి పారితోషికంగా ఇవ్వాలన్నది ముందస్తు షరతని సమాచారం. శాటిలైట్ హక్కుల్ని దాచుకొంటే.. మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకొందామని పూరి ఫిక్సయ్యాడట. అందుకే…. రూ.4.5 కోట్ల ఆఫర్ వచ్చినా అమ్మడం లేదని తెలుస్తోంది.