ఇంటి నుంచి బయటి వెళ్లలేకపోవడం కష్టమా?.
రోడ్డుపై ఇది వరకటిలా హాయిగా తిరగలేకపోవడం కష్టమా?
సినిమాలూ – షికార్లూ లేకపోవడమే కష్టమా?
ఇంటి పట్టున కూర్చుని, కాలు బయటపెట్టకపోవడమే కష్టమా?
– ఏం కాదు. ప్రపంచంలోని కష్టాలు, లక్షల మంది అనుభవిస్తున్న దరిద్రాలతో పోలిస్తే… మనవేం పెద్ద కష్టాలు కావు. ఆ మాటకొస్తే కష్టాలే కావు.
ఈ మాట చెబుతోంది ఎవరో కాదు. పూరి జగన్నాథ్. లాక్ డౌన్లో ఇంట్లో కూర్చోవడమే కష్టం అనుకోవొద్దు.. ప్రపంచంలో ఇలాంటి కష్టాలు చాలా ఉన్నాయంటూ ఓ లిస్టు బయటపెట్టాడు పూరి. సిరియా నుంచి.. సైనికుల వరకూ అష్టకష్టాలెలా ఉంటాయి? దరిద్య్రం అంటే ఏమిటి? అనేది పూస గుచ్చినట్టు వివరించాడు. పూరి చెప్పిన వివరణలు చూస్తే… ప్రపంచాన్ని పూరి ఇంత చదివేశాడా అనే ఆశ్చర్యం… అసలు ప్రజలు ఇంత కష్టాలు అనుభవిస్తున్నారా అనే ఆందోళన కలగక మానవు. అంతే కాదు.. మనం ఎంతో సుఖంగా ఉన్నామన్న సంగతీ అర్థమవుతోంది. పూరి తన మాటలతోనే ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. అంతే కాదు.. చివర్లో ఓ బాంబు కూడా విసిరాడు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో అయిపోతుందని అనుకోవద్దని, జూన్ వరకూ కొనసాగినా ఆశ్చర్యపోవద్దని – మనం ఇప్పడు వార్ జోన్లో ఉన్నామని, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండమని హితవు పలికాడు. లాక్ డౌన్లో ఇంట్లో ఉండడం స్వేచ్ఛని హరించేయడమే అని, ఇంత కష్టం ఇంకెప్పుడూ రాకూడదని భావించేవాళ్లంతా పూరి విడుదల చేసిన వీడియోని ఓసారి చూడాల్సిందే.