దాసరి నారాయణరావుకి ఓ అలవాటు ఉండేది. తను దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా, శిష్యుల్ని ప్రోత్సహించడం మర్చిపోలేదు. తన కథలతో, తన నిర్మాణంలో, తన శిష్యులతో సినిమాలు తీశారాయన. ఆయన్నుంచి వచ్చినంతమంది శిష్యులు… మరే దర్శకుడి నుంచీ రాలేదు. అందుకే ఆయన దర్శకరత్న అయ్యారు. ఆ లక్షణాలు కాస్తో కూస్తో పుణికిపుచ్చుకొన్న ఈ తరం దర్శకుడు.. సుకుమార్. దర్శకుడిగా పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ.. తన కథలతో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ, శిష్యుల్ని ప్రోత్సహిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ నుంచి చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే బాటలో నడవబోతున్నాడు పూరి జగన్నాథ్.
దాసరిలానే, ఒక్క రోజులోనే కథ రాయగల సత్తా… పూరికి ఉంది. తన దగ్గర బౌండెడ్ స్క్రిప్టులు 50 వరకూ ఉన్నాయని టాక్. అవన్నీ పూరీనే తీయలేడు. తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ద్వారా వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొద్దామనుకుంటున్నాడు. పూరి ఇది వరకు కూడా తన కథలతో సినిమాలు తీయించాడు. కానీ ఈసారి మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడట. తన శిష్యులనే కాదు, యంగ్ టాలెంట్ ఎవరిలో ఉన్నా, వాళ్లని ప్రోత్సహించాలని ఫిక్సయ్యాడు. ఆయా చిత్రాలకు తనే కథ, మాటలూ అందించబోతున్నాడట. ప్రస్తుతం జనగణమన పనుల్లో బిజీగా ఉన్నాడు పూరి. మరోవైపు లైగర్ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కాస్త విరామం దొరగ్గానే, తను నిర్మాతగా నాలుగైదు సినిమాల్ని ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది.