పూరి జగన్నాథ్ .. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు. ఓ ఫ్లాపు రావొచ్చు… హిట్టు కొట్టొచ్చు. తన వాల్యూ తనదే. పూరి సంగతి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా ‘ఆటోజానీ’ మెదులుతుంటుంది. చిరంజీవి కోసం చాలా ఇష్టంగా పూరి రాసుకొన్న కథ ఇది. చిరంజీవి 150 వ సినిమా కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆటోజానీ ఓ ఆప్షన్. చిరు దాదాపుగా ఓకే అన్న కథ ఇది. కానీ సెకండాఫ్ కాస్త డౌటు కొట్టడంతో చిరు ఆ కథ పక్కన పెట్టాడు. కానీ పూరి మాత్రం వదల్లేదు. పూరీతో ఆటోజానీ చేస్తా అని పట్టుపట్టాడు. ఆ కథపై కొంతకాలం వర్క్ చేశాడు కూడా.
కట్ చేస్తే.. చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో పూరి అతిథి పాత్రలో తళుక్కున మెరిశాడు. ఆ విజయంలో పూరి కీ వాటా దక్కింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా… చిరు, పూరిల మధ్య చిట్ చాట్ జరిగింది. లైవ్ లో పూరి, చిరు మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా ‘ఆటోజానీ’ ప్రస్తావన వచ్చింది. ‘నా ఆటోజానీ ఏం చేశావ్ పూరి.. ఉందా? ఆ పేపర్ చించేశావా’ అని ఆరా తీశాడు చిరు. ‘లేదు సార్.. ఆ కథ పాతదై పోయింది. మీ కోసం ఇంకో మంచి కథ రాస్తున్నా. త్వరలోనే కలుస్తా` అని సమాధానం ఇచ్చాడు పూరి. ‘నువ్వు ఎప్పుడైనా రావొచ్చు. నేను ఎదురు చూస్తుంటా’ అని చిరు కూడా మాటిచ్చేశాడు. సో.. చిరు – పూరి కాంబోపై మరోసారి… ఆశలు చిగురించినట్టే.