పూరి జగన్నాథ్.. ఆయన స్పీడు అందుకోవడం ఈ తరం దర్శకులెవ్వరికీ సాధ్యం కాదేమో.
సినిమా మొదలెట్టే ముందే రిలీజ్ డేట్ చెబుతారు. ఆ టైమ్‌కి సినిమా సిద్ధం చేస్తారు కూడా. పైసా వసూల్ సినిమాని అనుకొన్న సమయానికంటే నెల రోజులు ముందే విడుదల చేసి.. ఆశ్చర్యపరిచారు. అందుకే పాతిక సినిమాల మైలు రాయిని వేగంగా అందుకోగలిగారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పైసా వసూల్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా పూరితో తెలుగు 360 చేసిన చిట్ చాట్ ఇది.
పైసా వసూల్.. కమర్షియల్‌గా ఓకేనా?
తొలి మూడు రోజులు వసూళ్లు బాగున్నాయి. ఈరోజు సోమవారం కూడా కలక్షన్లు స్టడీగా ఉన్నాయి.
ఫ్యాన్స్ సందడి ఎలా ఉంది?
వాళ్లకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. థియేటర్లు చూడండి. కాగితాలతో నిండిపోయాయి. వాటిని మళ్లీ క్లీన్ చేసుకోవడం తలకు మించిన పనైపోతోంది.
ఇది కేవలం బాలయ్య ఫ్యాన్స్‌ని సంతృప్తిపర్చడానికి తీసిన సినిమా అనుకోవాలా?
అనుకోవొచ్చు. ఎందుకంటే బాలయ్యకున్న అభిమానగణం మామూలుగా లేదు. యూఎస్‌లో 24 రాష్ట్రాలలో ఈ సినిమా విడుదల చేశాం. బ్యాంకాక్‌లో రిలీజ్ చేశాం. అక్కడ ఫ్యాన్స్ కి సైతం ఈసినిమా బాగా నచ్చేసింది.
మేన్షన్ హౌస్ తప్ప ఇంకేం తెలీదు అనే డైలాగ్ రాశారు కదా.. అది విని బాలయ్య ఏమన్నారు?
చదివి నవ్వుకొన్నారంతే. ఏ డైలాగ్ కోసం పెద్దగా డిస్కర్షన్ జరగలేదు.
డైలాగుల పరంగా సంతృప్తి పడిపోయినట్టేనా?
బాలయ్యకు ఎలాంటి డైలాగులు రాయాలి అనే విషయంపై ముందు నుంచీ ఓ అవగాహనతోనే ఉన్నా. ఈ డైలాగ్ బాలయ్య నోటి నుంచి వింటే బాగుంటుంది అనుకొన్న ప్రతీదీ ఇందులో క్వాయిన్ చేశా.
బాలయ్యని ప్రేమించి ఈ పాత్ర తయారు చేసుకొన్నట్టు అనిపిస్తుంది..
అవును.. నేనే కాదు, యూనిట్ లో అందరూ బాలయ్య ప్రేమలో పడిపోతారు. అంత మంచి మనిషి ఆయన. యూనిట్లో ప్రతీ ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తారు. సెట్లోకి వచ్చేముందు అందరికీ పేరు పేరునా హాయ్ చెబుతారు. వెళ్లిపోతున్నప్పుడు మళ్లీ బాయ్ చెప్పి వెళ్లిపోతారు. అంతటి స్టార్ హీరో… ఇలా చేయాల్సిన అవసరం లేదు.
బాలయ్య ఫ్యాన్స్ వరకూ ఈ సినిమా ఓకే. కానీ.. సినిమా చూస్తే పోకిరి ఛాయలు కనిపిస్తున్నాయన్న విమర్శ వినిపిస్తోంది.
మీరన్నది కరెక్టే. కానీ ఒక్కటి చెబుతా. మిలటరీ హోటల్లో భోజనం ఒకలా ఉంటుంది. బ్రాహ్మణ హోటెల్లో భోజనం ఒకలా ఉంటుంది. ప్రతీ దర్శకుడికీ ఓ స్టైల్ ఉంటుంది. విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఒకే ఫ్లేవర్‌లో ఉంటాయి. రామూ సినిమాలూ అంతే. నేనూ అంతే! గన్ కల్చర్, గ్యాంగ్ స్టర్ అనగానే.. పోకిరి ఛాయలు వస్తాయి. అందులో తప్పేం లేదు. ఇవన్నీ మాకు తెలియకుండా చేసిన పనులేం కావు. తెలిసే.. అలాంటి కథనే ఎంచుకొన్నాం.
పూరి స్పీడు స్పీడుగా సినిమాలు తీస్తుంటాడు.. రహస్యం ఏంటి?
నాకు సినిమా తప్ప ఇంకేం తెలీదు. పని అంటే పిచ్చి. అంతే.
నెల రోజులు ముందుగానే ఈ సినిమా సిద్దం చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయా?
నిర్మాత అడిగారు. పైగా అక్టోబరులో పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఎన్టీఆర్, మహేష్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడం మంచిది కాదు. అందుకే మేమే ముందొచ్చాం.
బాలీవుడ్లో సినిమా చేసే ఛాన్సుందా?
ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. టాలీవుడ్‌పైనే దృష్టి.
మీ అబ్బాయితో సినిమా చేస్తున్నార్ట..
అవును.. అక్టోబరులో మొదలవుతుంది. తనకోసం మూడు కథలు సిద్దంగా ఉన్నాయి. ఏది ఫైనల్ అవుతుందో చెప్పలేను. కాకపోతే.. ఆకాష్‌తో చేసే సినిమా ఓ లవ్ స్టోరీ అవుతుంది.
ఆకాష్ ప్రత్యేక శిక్షణ ఏమైనా తీసుకొన్నాడా?
చిన్నప్పటి నుంచీ నటిస్తూనే ఉన్నాడు కదా? ఆంధ్రాపోరి అనే సినిమాలో హీరోగా నటించాడు. డాన్స్ క్లాసులకు వెళ్తున్నాడు. అంతకు మించిన శిక్షణ ఏం తీసుకోవడం లేదు.
* బాలయ్యతో మరో సినిమా చేస్తున్నార్ట..
అవును.. 103వ సినిమాకి నేనే దర్శకుడ్ని. సంక్రాంతికి మొదలయ్యే అవకాశాలున్నాయి.