అన్నీ బాగుంటే ఈ పాటికి ‘జనగణమన’ షూటింగ్ మొదలైపోయేది. `లైగర్` ఫ్లాప్ అవ్వడం, ఆ ఎఫెక్ట్… `జనగణమన`పై పడడం తెలిసిన విషయాలే. `లైగర్` విడుదలైన మరుసటి రోజే.. `జనగణమన` చేయకూడదని పూరి – విజయ్‌లు డిసైడ్ అయిపోయారు. రియాలిటీలోకి వచ్చి ఆలోచించడం వల్ల ఇంత భారీ బడ్జెట్ తో `జనగణమన` వర్కవుట్ కాదని తేలిపోయింది. విజయ్ ఈ సినిమా ఇప్పుడే కాదు.. ఎప్పటికీ చేసే అవకాశం లేదు. కాకపోతే పూరి దగ్గర మరో ఆప్షన్ ఉంది. ఈ సినిమాని విజయ్‌తో కాకుండా మరో హీరోతో చేయడం. పూరి ఈ సినిమా కోసం మరో హీరోని అన్వేషిస్తున్నాడని కూడా ప్రచారం మొదలైంది.
అయితే.. అదంత తేలిక కాదు. ఎందుకంటే ఈ కథ ఆల్రెడీ చాలా మందికి చెప్పేశాడు పూరి. ఇండస్ట్రీలోని అందరి హీరోల దగ్గరకూ `జనగణమన` వెళ్లింది. దాదాపు ఆ హీరోలంతా నో చెప్పినవాళ్లే. మహేష్ అయితే.. చేస్తా అని చెప్పి చివర్లో హ్యాండ్ ఇచ్చాడు. మహేష్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు కాదన్నాడో.. అప్పటి నుంచీ ఈ కథపై పూరికి ఆసక్తి పోయింది. కానీ విజయ్ రాకతో.. కొత్త ఆశలు చిగురించాయి. మళ్లీ పట్టాలెక్కిద్దామనుకొన్నాడు. కానీ ఆ ప్రయత్నమూ బెడసి కొట్టింది. `జనగణమన` ఏ హీరోతో తీసినా మినిమం వంద కోట్లయినా అవుతుంది. ఆ కథకు అంత బడ్జెట్ అవసరం. పూరి ఏం చేసినా సొంత నిర్మాణ సంస్థలో చేస్తాడు. ఇప్పుడు వంద కోట్లు తీసి సినిమా చేసేంత ఓపిక పూరికి లేదన్నది వాస్తవం. సో.. జనగణమన మరో హీరోతో చేస్తాడన్నది కూడా ఓ గాసిప్ గానే అనుకోవాలి. ఈ కథ ఎలాగైనా చెప్పాలని పూరికి అనిపిస్తే.. అందరూ కొత్త వాళ్లతో తక్కువ బడ్జెట్ లో తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే.. ఈ కథకు ఓ స్టార్ హీరోనే కావాలి.