చిరంజీవితో ఓ సినిమా చేయాలన్నది పూరి జగన్నాథ్ కల. 150వ చిత్రం పూరి చేతికి వెళ్లినట్టే వెళ్లి చేజారిపోయింది. ఆ తరవాత కూడా పూరి తన వంతు ప్రయత్నాలు చేశాడు. అయితే ఇప్పుడు చిరు చేస్తున్న ఓ సినిమాకి తన వంతు సాయం అందించబోతున్నాడట.
వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `గాడ్ ఫాదర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన `లూసీఫర్`ని చిరు రీమేక్ చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకుడు. ఇటీవల ఊటీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూరికి `లూసీఫర్` సినిమా అంటే చాలా ఇష్టం. చిరు ఈ సినిమా చేస్తున్నాడని తెలిసి తెలుగులో, చిరుకి తగినట్టుగా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో కొన్ని సలహాలూ సూచనలు ఇచ్చాడట. `గాడ్ ఫాదర్` స్క్రిప్టు పూర్తయిపోయినా పూరి ఇచ్చిన సలహాలు బాగుండడంతో.. వాటిని కూడా జోడించి కొత్త సీన్లు రాసుకుని, దానికి అనుగుణంగా స్క్రిప్టు మార్చినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. పూరిది మంచి మాస్ బ్రెయిన్. చిరుని తాను ఎలా చూడాలనుకుంటున్నాడని, ఎలా చూపించాలని ఆశ పడుతున్నాడో.. అలాంటి ఎలివేషన్లు, సీన్లూ.. చెప్పి ఉంటాడు. చిరుకి అది బాగా నచ్చి ఉంటుంది. అలా.. `గాడ్ ఫాదర్`లో పూరి తన వంతు పాత్ర పోషించేశాడు. మరి ఆ సీన్లు ఏమిటో? ఎలా వచ్చాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.